Begin typing your search above and press return to search.

పవన్ అంకుల్ కోసం చిన్నారి దీపిక నిరీక్షణ

By:  Tupaki Desk   |   21 Feb 2016 4:54 AM GMT
పవన్ అంకుల్ కోసం చిన్నారి దీపిక నిరీక్షణ
X
చిట్టి గుండెలో అంతులేని అభిమానం చూపురులను కంటతడి పెట్టిస్తోంది. బుజ్జిబుజ్జి మాటలతో ఆకట్టుకుంటున్న ఆరేళ్ల చిన్నారి దీపికకు వచ్చిన కష్టం తెలిస్తే గుండెను పిండేస్తాయి. తనకొచ్చిన మాయదారి రోగం గురించి తెలీని ఆ చిన్నారి.. తనకొచ్చింది జ్వరమని.. తాను ఎంతగానో అభిమానించే పవన్ కల్యాణ్ కానీ తన దగ్గరకు వస్తే చాలు.. తన‘లోని’ జ్వరం పారిపోతుందని బలంగా నమ్మతున్న తీరు చూస్తే.. ఈ విషయం పవన్ కల్యాణ్ కు తెలిస్తే ఎంతబాగుండు అనిపించక మానదు. తన కోసం పవన్ అంకుల్ తప్పకుండా వస్తారంటూ నమ్మకంగా చెబుతున్న ఆ అమ్మాయి మాటలు వింటే.. పవన్ ఎక్కడున్నా ఆ చిన్నారి నమ్మకాన్ని నిలబెట్టాలని పలువురు కోరుకుంటున్నారు. గుండెలు పిండేసే ఈ ఉదంతంలోకి వెళితే..

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని పెద్దపేటకు చెందిన ఆరేళ్ల కనకచంద్రదీపికకు బ్లడ్ క్యాన్సర్. ఆ విషయం ఆ చిన్నారికి తెలీదు. నెల రోజుల కిందట తీవ్ర అస్వస్థతకు గురైన ఆ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళితే.. మాయదారి క్యాన్సర్ అమ్మాయిని పట్టుకుందని తేలింది. పవన్ కల్యాణ్ అంటే విపరీతంగా అభిమానించే ఆ అమ్మాయి.. తనకొచ్చిన జ్వరం ఎంతకూ తగ్గకపోవటం.. రోజురోజుకీ క్షీణిస్తున్న ఆరోగ్యం సెట్ కావాలంటే పవన్ స్టార్ ఒక్కసారి తన దగ్గరకు వస్తే చాలు.. ఆ జబ్బు ఇట్టే తగ్గిపోతుందని నమ్ముతోంది. తన గదిని మొత్తం పవన్ ఫోటోలతో నింపేసిన ఈ చిన్నారికి పట్టిన క్యాన్సర్ వదలాలంటే రూ.20లక్షల వరకూ ఖర్చు అవుతుందని చెబుతున్నారు.

వైద్య ఖర్చుల కోసం ఇప్పటికే ఉన్న ఇంటిని దీపిక తల్లిదండ్రులు తనఖా పెట్టారు. తమ కూతురికి వైద్యం చేయించి ప్రాణదానం చేయాలని వారు పలువురును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే చిన్నారి దీపికకు అవసరమైన వైద్యసాయం చేసేందుకు వీలుగా రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి.. ఎమ్మెల్యే రామాంజనేయులు.. తదితరులు ట్రై చేస్తున్నారు. చిన్నారి విషయాన్ని ఏపీ సర్కారు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తనకు వచ్చిన జ్వరాన్ని పవన్ అంకుల్ తగ్గించేస్తారని.. తన దగ్గరకు ఆయన రావాలని కోరుకోవటం గమనార్హం. మరి.. చిన్నారి దీపిక కోసం పవన్ కల్యాణ్ వెళతారా? ఆమె నమ్మకాన్ని నిలబెడతారా? అన్నది చూడాలి. గతంలో ఇలాంటి ఉదంతాలు తన దృష్టికి వచ్చిన వెంటనే పవన్ స్పందించి సాయం చేయటం ఒకఎత్తు అయితే.. ఒక చిన్నారి కోలుకోవటం గమనార్హం.