Begin typing your search above and press return to search.

ఈ రోజు గ్ర‌హ‌ణంలో ప్ర‌త్యేక‌త ఏమిటో తెలుసా?

By:  Tupaki Desk   |   27 July 2018 4:10 AM GMT
ఈ రోజు గ్ర‌హ‌ణంలో ప్ర‌త్యేక‌త ఏమిటో తెలుసా?
X
మ‌రో చంద్ర‌గ్ర‌హ‌ణం వ‌చ్చేసింది. ఇంకో ఖ‌గోళ అద్భుతాన్ని తీసుకురానుంది. గ్ర‌హ‌ణం ఎప్పుడూ వ‌చ్చినా.. ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌ల‌కు.. పరిశోధ‌కుల‌కు.. పండితుల‌కు చాలా ప్ర‌త్యేక‌మే. అయితే.. మిగిలిన చంద్ర‌గ్ర‌హ‌ణాల‌కు ఈ రోజు రాత్రి చోటు చేసుకునే గ్ర‌హ‌ణానికి ప్ర‌త్యేక‌త ఒక‌టి ఉంది. ఈ శ‌తాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ సంపూర్ణ చంద్ర‌గ్ర‌హ‌ణంగా చెబుతున్నారు. మామూలుగా అయితే.. గ్ర‌హ‌ణ స‌మ‌యాలు గంట‌.. రెండు గంట‌లు ఉంటాయి. కానీ.. ఈ రోజు గ్ర‌హ‌ణం లెక్క వేరు.

వివిధ ద‌శ‌లు దాటే ప్ర‌క్రియ‌ల్ని క‌లుపుకుంటే మొత్తం ఆరు గంట‌ల‌కు పైనే ఈసారి చంద్ర‌గ్ర‌హ‌ణం ఉంటుంద‌ని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ రోజు చంద్ర‌గ్ర‌హ‌ణం ప్ర‌పంచంలోని ప‌లు దేశాల్లోనూ ఆవిష్కృతం కానుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం ఈ సంపూర్ణ చంద్ర‌గ్ర‌హ‌ణం శుక్ర‌వారం రాత్రి 10.44 గంట‌ల‌కు మొద‌లై శ‌నివారం తెల్ల‌వారుజామున 4.58 గంట‌ల వ‌ర‌కూ సాగ‌నుంది.

శుక్ర‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత అంటే.. ఒంటి గంట నుంచి 2.43 గంట‌ల మ‌ధ్య ఈ గ్ర‌హ‌ణం ఉచ్చ‌ ద‌శ‌కు చేరుకుంటుంద‌ట‌. ఆ సంద‌ర్భంగా చంద్రుడు ముదురు ఎరుపులో క‌నిపిస్తాడు. దీన్నే బ్ల‌డ్ మూన్ గా అభివ‌ర్ణిస్తున్నారు. శాస్త్రీయంగా చూస్తే.. సంపూర్ణ చంద్ర‌గ్ర‌హ‌ణంలో సూర్యుడి ప్ర‌త్య‌క్ష కిర‌ణాలు భూమి అంచుల నుంచి చంద్రుడి మీద ప‌డ‌తాయి. అప్పుడు చంద్రుడు ఎరుపు రంగులో క‌నిపిస్తాడు.

ఇదే త‌ర‌హాలో సంపూర్ణ చంద్ర‌గ్ర‌హ‌ణం చోటు చేసుకోవాలంటే మ‌రో 105 ఏళ్లు (2123 జూన్ 23న‌) ప‌డుతుంద‌ని చెబుతున్నారు. అంటే.. మ‌న‌మే కాదు.. మ‌న పిల్ల‌లు కూడా చూడ‌లేరు. ఆ మాట‌కు వ‌స్తే వారి పిల్ల‌లు కూడా ఏ వృద్ధ వ‌య‌సులోనో చూస్తార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అంత‌టి ప్ర‌త్యేక‌త ఈ రోజు సంపూర్ణ చంద్ర‌గ్ర‌హ‌ణం సొంతంగా చెప్పాలి.

మిగిలిన దేశాల్లో ఏర్ప‌డే ఈ ఖ‌గోళ అద్భుతం గురించి ప‌క్క‌న పెడితే.. మ‌న దేశంలో ఈ రాత్రి 10.44 గంట‌ల‌కు మొద‌లై అర్థ‌రాత్రి ఒంటిగంట‌కు సంపూర్ణ గ్ర‌హ‌ణ ద‌శ‌కు చేరుకుంటుంది. 1.43 గంట‌ల పాటు బ్ల‌డ్ మూన్ క‌నువిందు చేయ‌నుంది.

ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం కార‌ణంగా దేశంలోని కొన్ని మెట్రో న‌గ‌రాల్లో ఈ గ్ర‌హ‌ణం పూర్తి స్థాయిలో క‌నిపించే అవ‌కాశం లేదంటున్నారు. భూక‌క్ష్య‌లో చంద్రుడు అత్యంత దూరంలో ఉండ‌టంతో మామూలు కంటే చిన్న‌గా క‌నిపిస్తాడు. భూమి నీడ మ‌ధ్య‌లో నుంచి చంద‌మామ ఎక్కువ స‌మ‌యం ప్రయాణిస్తున్న కార‌ణంగా అధిక స‌మ‌యం చీక‌టి ఏర్ప‌డి సుదీర్ఘ గ్ర‌హ‌ణం కానుంది.

సంపూర్ణ సూర్య గ్ర‌హ‌ణానికి భిన్నంగా చంద్ర‌గ్ర‌హ‌ణం సంద‌ర్భంగా ఎలాంటి ప్ర‌త్యేక ప‌రిక‌రాలు.. అద్దాలు అవ‌స‌రం లేకుండా చూసే వీలుంది. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఈ రోజు రాత్రి అంగార‌క గ్ర‌హం కూడా చంద‌మామ‌కు అత్యంత చేరువులో క‌నిపించ‌నుంది. గ్ర‌హణం వేళ‌లో అది జ‌రుగుతుంది.. ఇది జ‌రుగుతుంద‌న్న మూఢ న‌మ్మ‌కాలు పెట్టుకోకుండా సెల్ఫీలు కూడా దిగొచ్చ‌ని చెబుతున్నారు. మూఢ న‌మ్మ‌కాల‌తో ఉండ‌టం మంచిది కాదంటున్నారు. ఇక‌.. మీరు ఎలా ఉండాల‌నుకుంటే అది మీ ఇష్టం సుమా