Begin typing your search above and press return to search.

బ్లూవేల్‌ పై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు

By:  Tupaki Desk   |   27 Oct 2017 9:22 AM GMT
బ్లూవేల్‌ పై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు
X
ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌ణికించిన బ్లూవేల్ గేమ్ పై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆస‌క్తిక‌ర తీర్పును జారీ చేసింది. డేంజ‌ర్ గేమ్‌గా అభివ‌ర్ణించిన సుప్రీంకోర్టు.. ఈ ఆన్ లైన్ ఆట వ‌ల్ల క‌లిగే న‌ష్టాల‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరింది. ఈ గేమ్ వ‌ల్ల క‌లిగే అన‌ర్థాల‌పై దూర‌ద‌ర్శ‌న్ ఛాన‌ళ్ల ద్వారా ప్ర‌భుత్వం ప్ర‌చారం చేయాల‌న్న అత్యున్న‌త న్యాయ‌స్థానం ప్రైవేటు ఛాన‌ళ్లు కూడా ఈ గేమ్ మీద అవ‌గాహ‌న క‌ల్పిస్తూ షోల‌ను చేయాలంది.

ర‌ష్యాలో మొద‌లైన ఈ ఆన్ లైన్ ఆట మ‌త్తులో ప‌డి ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లువురు ఇప్ప‌టికే మృత్యువాత ప‌డ్డారు. చిన్న చిన్న టాస్క్ లు ఇస్తూ.. చివ‌ర‌కూ ఆడే వ్య‌క్తి సూసైడ్ చేసుకునేలా బ్లూవేల్ గేమ్ చేస్తుంది. ఈ ఆట మ‌త్తులో ప‌డిన వారిని బ‌య‌ట‌కు తీసుకురావ‌టం క‌ష్ట‌మైన ప‌నిగా చెబుతారు.

ర‌ష్యాకు చెందిన మాన‌సిక ఉన్మాది ఈ గేమ్‌ ను త‌యారు చేశారు. ఇప్ప‌టికే ప‌లు దేశాల్లో ఈ గేమ్‌ ను నిషేధించారు. ఆన్ లైన్ లో ఈ గేమ్ దొర‌క‌ని రీతిలో సెర్చింజ‌న్లు జాగ్ర‌త్త‌లు తీసుకున్నాయి. ఇలాంటి స‌మ‌యంలోనే సుప్రీంకోర్టు స్పందించి.. గేమ్ మీద ప్ర‌జ‌ల్లో మ‌రింత అవ‌గాహ‌న పెంచేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని కోర‌టం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ప్రాణాపాయం క‌లిగించే ఆన్ లైన్ గేమ్ ల‌ను నిలువ‌రించేందుకు నిపుణులు క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.