Begin typing your search above and press return to search.

బీజేపీ ప‌రువు చివ‌రి నిమిషంలో ద‌క్కింది

By:  Tupaki Desk   |   23 Feb 2017 1:44 PM GMT
బీజేపీ ప‌రువు చివ‌రి నిమిషంలో ద‌క్కింది
X
మహారాష్ట్రలో మున్సిపల్‌ - స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఊహించ‌ని అనుభూతిని మిగిల్చాయి. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టణాల్లో బీజేపీ హవా కనబర్చింది. ఠానే, ముంబయి మినహా 8 మున్సిపాలిటీలను బీజేపీ కైవసం చేసుకుంది. ముంబయి పుర‌పాలిక‌లో శివసేన 84 - బీజేపీ 81 స్థానాల్లో గెలుపొందింది. ముంబయిలో మొత్తం 227 వార్డులు ఉన్నందున 114 స్థానాలు గెలిచిన వారికి పాలన చేపట్టే అవకాశం ఉంది. మ‌రోవైపు శివసేన ఆధిక్యంలో కొనసాగడంతో ఆ పార్టీ కార్యకర్తలు మాతో శ్రీ నిలయం దగ్గర నుంచి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు.

కాగా, ఈ ఫ‌లితాల‌పై సీఎం దెవేంద్ర ఫడ్నవీస్‌ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించిందని పేర్కొన్నారు. పారదర్శక పాలనకు ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. బీఎంసీలో 31 స్థానాల నుంచి 81 స్థానాలకు బీజేపీ బలం పెరిగిందని తెలిపారు. మ‌రోవైపు బీఎంసీ ఎన్నికల్లో ముంబై ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరిస్తున్నట్లు కాంగ్రెస్ నేత సంజయ్ నిరూపమ్ తెలిపారు. బీఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ అధ్యక్ష పదవికి సంజయ్ నిరూపమ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ నిరూపమ్ మాట్లాడుతూ తాను పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. కొందరు సీనియర్ నేతలు పార్టీకి, తనకి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యల వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయని ఆరోపించారు. బీఎంసీ ఎన్నికల్లో శివసేన 84 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..కాంగ్రెస్ 31స్థానాలకు మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/