Begin typing your search above and press return to search.

అన్ని సెట్ అయ్యాకే పది, ఇంటర్ పరీక్షలు : మంత్రి ఆదిమూలపు సురేశ్ !

By:  Tupaki Desk   |   8 Jun 2021 11:30 AM GMT
అన్ని సెట్ అయ్యాకే పది, ఇంటర్ పరీక్షలు : మంత్రి ఆదిమూలపు సురేశ్ !
X
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్, పది పరీక్షలు నిర్వహిస్తారా , లేక రద్దు చేస్తారా అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో పరీక్షలను రద్దు చేశారు. కరోనా వ్యాప్తి పెరిగిపోతున్న తరుణంలో పలు ప్రభుత్వాలు ఆ దిశగానే అడుగులు వేస్తున్నాయి. ఇక ఏపీలోనూ కరోనా కారణంగా పరీక్షల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. తాజాగా కోర్ట తీర్పు నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే , వాయిదా కాదు రద్దు చేయాలంటూ డిమాండ్ పెరుగుతోంది. కరోనా టైంలో విద్యార్థుల జీవితాలతో ఆట్లాడడం మంచిది కాదని విపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి.

అయినా ప్రభుత్వం మాత్రం పరీక్షలు నిర్వహించే తీరుతామని చెప్తుంది. ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో , మరోసారి స్పష్టత ఇచ్చారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఎవరు ఎన్ని రకాల ప్రయత్నాలను చేసినా , ప‌రీక్ష‌లు నిర్వ‌హించి తీర‌తామ‌ని స్ప‌ష్టం చేశారు. కరోనా ఉద్ధృతి త‌గ్గాక ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు కోర‌డం లేద‌ని ఆయ‌న తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేస్తే మనమూ చేయాలా, అని ఆదిమూలపు ప్రశ్నించారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయా, అని నిలదీశారు. కాగా, ఏపీలో పదో తరగతి పరీక్షలపై జులైలో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. వాస్తవానికి జూన్ 7 నుంచి పది పరీక్షలు జరగాల్సి ఉండగా, ఆ సమయంలో కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తుండడంతో వాయిదా వేశారు. ఇక ఇంటర్ పరీక్షలను ఆగస్టులో నిర్వహించే అవకాశాలున్నాయి. పరీక్షల తేదీకి 15 రోజుల ముందు ప్రకటన చేస్తామని మంత్రి ఆదిమూలపు ఇప్పటికే తెలిపారు.