Begin typing your search above and press return to search.

పుష్క‌రాల ప్ర‌మాదం రోజే..మ‌రో ప‌డ‌వ బోల్తా

By:  Tupaki Desk   |   14 July 2018 2:09 PM GMT
పుష్క‌రాల ప్ర‌మాదం రోజే..మ‌రో ప‌డ‌వ బోల్తా
X

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో మరో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న నాటు పడవ గోదావరి నదిలో బోల్తాపడింది. ఈ ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద చోటుచేసుకుంది. బోల్తా పడిన నాటుపడవలో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. గ్రామస్థులు వీరిలో సుమారు 10 మందిని కాపాడారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లుగా సమాచారం. నాటుపడవ సలాదివారిపాలెం లంక నుంచి పశువుల్లంకకు బయల్దేరి వెళ్తుండగా నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్‌కు తగిలి ప్రమాదం భారిన పడినట్లు సమాచారం.రెండు - మూడు రోజులుగా వర్షాలు పడుతుండటంతో గోదావ‌రి ఉధృతంగా ప్రవహిస్తున్న నేప‌థ్యంలో స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి.

పలాసతిప్ప నుంచి పశువుల్లంక గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోగా...పడవలో స్థాయికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటం వల్లే బోల్తా పడినట్లు చెబుతున్నారు. ప్రమాద సమయంలో పడవలో 40 మంది ఉన్నట్లు చెబుతున్నారు. పడవ బోల్తా పడిన విషయాన్ని ఒడ్డు నుంచి గమనించిన పశువుల్లంక గ్రామస్తులు వెంటనే మరికొన్ని పడవలతో స్పాట్ కు వెళ్లారు. 10 మందిని నదిలో నుంచి ఒడ్డుకి తీసుకొచ్చారు. మరో 10 మంది ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు. మిగిలిన 10 మంది గల్లంతు అయినట్లు ఒడ్డుకి వచ్చిన ప్రయాణికులు చెబుతున్నారు. ఇద్దరు చిన్నారుల మృతదేహాలు గాలింపులో దొరికాయి. గల్లంతు అయిన 10 మంది విద్యార్థులే. వీళ్లందరూ పదో తరగతి చదువుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, ప్ర‌మాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టాలని ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కోరారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. అందరూ క్షేమంగా బయటకు రావాలని కోరుకున్నారు.

ఇదిలాఉండ‌గా..గోదావరి మహాపుష్కరాల ప్రారంభం తొలిరోజైన మంగళవారం ఉదయం రాజమండ్రి కోటగుమ్మం పుష్కర ఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాట జరగడం, ఇందులో 27 మంది భక్తులు మృతి చెందడం తెలిసిన సంగ‌తే. ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగిన తేదీ రోజే మ‌రో ప్ర‌మాదం తెర‌మీద‌కు రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

గోదావ‌రిలో ప‌డ‌వ‌ప్ర‌మాదంలో గ‌ల్లంతైన‌ట్లుగా అనుమానిస్తున్న‌వారిపేర్లు

1. కొండేపూడి ర‌మ్య -10 వ త‌ర‌గ‌తి
2. పోలిశెట్టి వీర మ‌నీష - 10వ త‌ర‌గ‌తి
3. సుంక‌ర శ్రీజ - 4 వ త‌ర‌గ‌తి
4. సిరికోటి ప్రియ - 8 వ త‌ర‌గ‌తి
5. పోలిశెట్టి అనూష - 9 వ త‌ర‌గ‌తి
6. పోలిశెట్టి సుచిత్ర - 6వ త‌ర‌గ‌తి

అంద‌రూ ప‌శువుల‌లంక పాఠ‌శాల‌లో చ‌దువుతున్నారు

అంద‌రూ శేరిలంక‌ - కే. గంగ‌వ‌రం - పామ‌ర్ల మండ‌లానికి చెందిన వారిగా అనుమానిస్తున్నారు

* గ‌ల్లంతైన వారికోసం గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రంగా సాగుతున్నాయి

* ఇప్ప‌టికే స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మైన ఎన్‌ డీఆర్ ఎఫ్ ద‌ళాలు

* విశాఖ‌ప‌ట్నం నుంచి సంఘ‌ట‌న స్థలానికి బ‌య‌లుదేరిన నావికా ద‌ళ బృందాలు

వాస్తవానికి రెండో శనివారం కారణంగా ఈ రోజు స్కూల్ పిల్లలకి సెలవు. వనం మనం ( ప్రభుత్వ కార్యక్రమం ) కార్యక్రమం కోసం సెలవు రద్దు చేసి పిల్లలతో మొక్కలు నాటించారు. అదే వారి ప్రాణాలు తీసిందని ప‌లువురు పేర్కొంటున్నారు.