Begin typing your search above and press return to search.

లంగ‌ర్ల‌కు బోటు చిక్కిన‌ట్లే....!

By:  Tupaki Desk   |   30 Sep 2019 11:17 AM GMT
లంగ‌ర్ల‌కు బోటు చిక్కిన‌ట్లే....!
X
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావ‌రి న‌దిలో ముగినిపోయిన రాయల్ వశిష్ట పున్నమి బోటు వెలికి తీత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా బోటు మునిగిన చోట ఐదు లంగర్లు వేసింది సత్యం టీమ్. నీటి అడుగు భాగంలో రెండు లంగర్లు గట్టిగా పట్టుకున్నాయి. దీంతో అవి బోటుకే తగులుకుని ఉంటాయని భావిస్తున్నారు. లంగర్లకు కట్టిన ఐరన్‌ రోప్‌ లను ప్రొక్లెయినర్‌ తో లాగుతోంది సత్యం బృందం. ప్రస్తుతం కచ్చులూరు వద్ద వర్షం పడుతోంది. అయినా ఎక్కడా వెనకడుగు వేయకుండా బోటును వెలికితీత పనులను కొనసాగిస్తోంది సత్యం బృందం.

ప్రొక్లెయినర్‌ సహాయంతో ఈ బోటును నది గర్భం నుండి బయటకు తీసేందుకు సత్యం బృందం ప్రయత్నాలను ప్రారంభించింది. ప్రమాదం జరిగి 15 రోజులు కావస్తున్నందున బోటు క‌నుగొన‌డంపై ఏపీ స‌ర్కారు కృత‌నిశ్చ‌యంతో ఉంది. గోదావ‌రిలో మునిగిపోయిన‌ బోటు వెలికితీత పనులను నిన్న ప్రభుత్వం కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్‌ సంస్థకు ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలాజీ మెరైన్‌ సంస్థ యజమాని ధర్మాడి సత్యం బృందం రోప్‌ - లంగర్లతో ఘటన జ‌రిగిన స్థలంలో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

అయితే ఇప్పటికే 144 సెక్షన్‌ ఉండగా బోటు వెలికితీసే సమయంలో పనులకి అడ్డం తగిలేలాగా ఆ ప్రాంతానికి ఎవరూ రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ధర్మాడి సత్యం నేతృత్వంలో 25 మంది మత్స్యకారులు - నిపుణులు వెలికితీతలో పాల్గొన్నారు. క్రేన్‌ - ప్రొక్లెయిన్‌ - బోటు - పంటు - 800 మీటర్ల వైర్‌ రోప్‌ - రెండు లంగర్లు - మూడు లైలాండ్‌ రోప్‌ లు - పది జాకీలు - ఇతర సామగ్రి ఉపయోగిస్తున్నారు. అయితే నదిలోకి దిగకుండానే బోటు - పంటు మీద నుండి లంగర్లను నదిలోకి వదిలారు. అయితే ఈ లంగ‌ర్ల‌కు బోటు త‌గిలిన‌ట్లుగా స‌మాచారం.

అయితే బోటు ఇసుక‌లో కూరుకుపోవ‌డంతో పైకి తీసుకురావడం క‌ష్టంగా మారిన‌ట్లు తెలుస్తుంది. అయితే అది ఎంత ఇసుక‌లో కూరుకుపోయినా, ఎంత కష్ట‌మైనా బోటును మాత్రం తీయ‌కుండా వెనుదిరిగేది లేద‌ని స‌త్యం చెపుతున్నారు. అందుకే ఈ సారి బోటు త‌ప్ప‌కుండా చిక్కిన‌ట్లే.. బ‌య‌టికి వ‌చ్చేన‌ట్లే అనే ప్ర‌చారం సాగుతుంది. ఏదేమైనా బోటు వ‌స్తే అందులో మిగిలిపోయిన శ‌వాల బంధువుల‌కైనా కొంత ఊర‌ట ఉండే అవ‌కాశాలు ఉన్నాయి.