Begin typing your search above and press return to search.

సెల‌వైనా బ‌డికి..ప‌డ‌వ విషాదంలో ఆవేద‌న‌!

By:  Tupaki Desk   |   15 July 2018 5:27 AM GMT
సెల‌వైనా బ‌డికి..ప‌డ‌వ విషాదంలో ఆవేద‌న‌!
X
తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర పడవ ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ప్రమాదంలో ఏడుగురు గల్లంతవ్వగా - వారిలో ఆరుగురు ఉన్నత పాఠశాల విద్యార్థినులే. వాస్తవానికి రెండో శనివారం కావడంతో పాఠశాలకు సెలవు ప్రకటించాల్సి వుంది. అయితే వేసవి సెలవుల అనంతరం పాఠశాలలను పునఃప్రారంభించిన సమయంలో ఎండలు అధికంగా ఉండటంతో జూన్ 19 నుంచి 23వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులుగా ప్రకటించింది.

ఆ సెలవు దినాలకు సంబంధించి సర్దుబాటు చేయడానికి 14వ తేదీ రెండో శనివారం అయినప్పటికీ పాఠశాలలు యథావిథిగా పనిచేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీనితో వివిధ లంక గ్రామాలకు చెందిన విద్యార్థులు పడవలో గోదావరి నది దాటి పశువుల్లంక - మురమళ్లలోని ఉన్నత పాఠశాలలకు హాజరయ్యారు. సాయంత్రం పాఠశాల ముగిసిన అనంతరం తమ తమ గ్రామాలకు తిరిగివెళ్లడానికి పడవ ఎక్కిన విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. రెండో శనివారం సెలవు అయ్యివుంటే తమ పిల్లలు తమకు దక్కేవారని గల్లంతైన వారి తల్లిదండ్రులు రోదిస్తున్నారు.

ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీలోని సలాదివారిపాలెం - తాళ్లరేవు మండలం కొత్తలంక - పిల్లంక - కె గంగవరం మండలం శేరిలంక తదితర గ్రామాల ప్రజలకు నిత్యం ఏ అవసరమొచ్చినా పడవ ప్రయాణమే ఆధారం. ఈ గ్రామాలకు చెందిన విద్యార్థులు పదుల సంఖ్యలో నిత్యం పడవపై పశువుల్లంక చేరుకుని - అక్కడి నుండి పాఠశాలలకు వెళుతుంటారు. ప్రమాదకరమైన ఈ ప్రయాణాలను తప్పించడానికి ఇక్కడ వంతెన నిర్మిస్తున్నారు. అయితే నిర్మాణంలో ఉన్న ఆ వంతెన పిల్లరు కారణంగానే ప్రస్తుతం ప్రమాదం చోటుచేసుకోవడం దుర‌దృష్ట‌క‌రం.