Begin typing your search above and press return to search.
టీడీపీ మంత్రి తో టీడీపీ నేత బస్తీ మే సవాల్!
By: Tupaki Desk | 14 May 2018 8:43 AM GMTతాము పదవిలో ఉన్నామన్న కారణం చేతనో....తమ మాటే శాసనం అన్న ఫీలింగ్ లో ఉండో....కొందరు రాజకీయ నేతలు అనాలోచితంగా వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కవుతుంటారు. బాధ్యత గల పదవిలో ఉండి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేసి అందరి నోళ్లలో నానుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఆ వ్యాఖ్యలకు బదులుగా వచ్చే ఘాటు సమాధానాలు వారిని ఇరకాటంలో కూడా పడేసిన సందర్భాలున్నాయి. తాజాగా, అదే తరహాలో ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తన వ్యాఖ్యలతో ఇరకాటంలో పడ్డారు. సొంతపార్టీకే కాకుండా సొంత నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు పై చినరాజప్ప చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. తనపై చేసిన వ్యాఖ్యలకు చినరాజప్పను భాస్కర రావు బహిరంగ చర్చకు ఆహ్వానించడం కలకలం రేపింది. పర్యాటక శాఖా మంత్రి అఖిల ప్రియ, ఏవీ సుబ్బా రెడ్డి ల మధ్య వివాదం సద్దుమణిగిందనుకున్న నేపథ్యంలో ఈ వ్యవహారం టీడీపీ అధిష్టానానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఓ పక్క ప్రతిపక్షాల దాడికితోడు సొంత పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో టీడీపీ అధినేతకు కంటిమీద కునుకుండడం లేదు.
ఏపీ హోం మంత్రి చినరాజప్ప - డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిలు ఓ తెలుగు న్యూస్ చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దాపురం నియోజకవర్గంలో బొడ్డు భాస్కరరామారావు, మెట్ల సత్యనారాయణరావులు తన ప్రత్యర్థులని చినరాజప్ప వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై భాస్కరరామారావు ఘాటుగా స్పందిస్తూ చినరాజప్పకు బహిరంగ లేఖ రాశారు. తన స్థాయికి తగ్గట్లు చిన రాజప్ప మాట్లాడలేదని మండిపడ్డారు. తనను ఏకవచనంలో సంబోధించిన సంస్కారం లేని వ్యక్తికి మిత్రుడిగా ఉండే కంటే శత్రువుగా ఉండడానికే ఇష్టపడతానని భాస్కర రావు వ్యాఖ్యానించారు. 25 సంవత్సరాల నుంచి జిల్లాకు - పెద్దాపురం నియోజకవర్గానికి ఎవరేం అభివృద్ధి చేశారో బహిరంగ చర్చలో తేల్చుకునేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. యనమల - జ్యోతుల నెహ్రూ వంటి పెద్దల సమక్షంలో బహిరంగ చర్చకు సవాల్ విసురుతూ లేఖ రాశారు. వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలని తలలు పట్టుకుంటున్న టీడీపీ అధిష్టానానికి అంతర్గత కుమ్ములాటలు మరింత ఇరకాటంలో పడేస్తున్నాయి. బయటికి వచ్చినవి ఒకటి రెండు ఉదంతాలే అయినా....టీడీపీలో కొందరు అగ్ర నేతల మధ్య కూడా అంతర్గత కలహాలు తీవ్రస్థాయిలో ఉన్నాయని వినికిడి. ఇకనైనా చంద్రబాబు వాటిపై దృష్టి సారించకుంటే రాబోయే ఎన్నికల్లో సొంత పార్టీ వారినుంచి మరిన్ని ఇబ్బందులు పడాల్సి రావచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.