Begin typing your search above and press return to search.

శ్రీ‌నివాస్ హ‌త్య కేసులో 8 మంది అరెస్టు!

By:  Tupaki Desk   |   28 Jan 2018 4:54 PM GMT
శ్రీ‌నివాస్ హ‌త్య కేసులో 8 మంది అరెస్టు!
X
న‌ల్గొండ లో కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య తెలంగాణ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచ‌రుడైన శ్రీ‌నివాస్ హ‌త్య‌ కేసులో అత‌డి స్నేహితుల‌ను పోలీసులు అనుమానించారు. ఎట్ట‌కేల‌కు ఈ కేసు మిస్ట‌రీని పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన 8 మందిని ఆదివారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏ-1 చింతకుంట్ల రాంబాబు సహా 8మంది నిందితులను అరెస్ట్ చేశారు. ప‌రారీలో ఉన్న మ‌రో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఏ-2 మాండ్ర మల్లేష్‌ - ఏ-3 ఆవుల శరత్‌ రాజు - ఏ-4 బాషపాక దుర్గయ్య - ఏ-5 కత్తుల చక్రి - ఏ-6 రామునూరి సతీష్‌ - ఏ-9 మెరుగు గోపి - ఏ-10 మాతంగి మోహన్‌ - పరారీలో ఏ-7 మాండ్ర మహేష్‌ - ఏ-8 మిట్టపల్లి సాయి - ఏ-11 ప్రసాద్ లుగా పోలీసులు నిర్ధారించి కేసులు నమోదు చేశారు. అయితే, అంద‌రూ అనుకున్న‌ట్లుగా ఇది రాజ‌కీయ కోణంలో జ‌రిగిన హ‌త్య కాద‌ని పోలీసులు తెలిపారు.

నిందితులంతా శ్రీనివాస్ కు మిత్రులేనని ఎస్పీ శ్రీనివాస్‌ రావు చెప్పారు. ఒక మిర్చి బండి విషయంలో నిందితులు గొడ‌వ‌ప‌డ్డార‌ని - ఈ వివాదాన్ని వారు బొడ్డుపల్లి శ్రీనివాస్ కు తెలిపారని చెప్పారు. మిర్చిబండి దగ్గర గొడవపడిన నిందితులను పోలీసులు చెదరగొట్టారని - పోలీసులు వెళ్లిపోయాక మళ్లీ వారంతా గుమిగూడారని - వారిని శ్రీనివాస్ మందలించాడ‌న్నారు. దీంతో నిందితులు ఆగ్ర‌హానికి గుర‌య్యార‌ని - క్ష‌ణికావేశంలో శ్రీనివాస్ తో గొడవప‌డి త‌ల‌పై బలంగా కొట్టార‌న్నారు. గాయ‌ప‌డ్డ శ్రీనివాస్ బ్ర‌తికితే త‌మ‌పై కక్ష తీర్చుకుంటాడని వారు భ‌య‌ప‌డ్డార‌ని - అందుకే దారుణంగా హ‌త్య చేశారన్నారు. హత్య చేసిన త‌ర్వాత నిందితులంతా హైదరాబాద్ లోని మిత్రుడి వద్ద తలదాచుకున్నారని తెలిపారు.
బొడ్డుపల్లి శ్రీనివాస్ పై 9 కేసులున్నాయని, నిబంధనల ప్ర‌కార‌మే శ్రీనివాస్ కు గన్‌మ్యాన్‌ కల్పించలేదన్నారు. తనకు రక్షణ కావాలని మునిసిపల్‌ చైర్మన్‌ లక్ష్మి కోరలేదని - కాల్ లిస్టు ఆధారంగా విచారణ జరిపామ‌ని చెప్పారు.

మ‌రోవైపు - శ్రీనివాస్ ను ప‌థ‌కం ప్రకారమే హత్య చేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. మిర్చిబండి దగ్గర గొడవ జరగలేదని - నిందితులు హైదరాబాద్ వెళ్లలేదనీ నిందితుల‌ కాల్ లిస్ట్‌ తీసుకోవాలని డిమాండ్ చేశారు. నకిరేకల్ ఎమ్మెల్యే - డీఎస్పీ కలిసి పథకం ప్ర‌కారం ఈ హత్య చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్యపై ఎస్పీ విచారణ జరపలేదని - టీఆర్ ఎస్ ప్రెస్‌ నోట్ ను మీడియాకు చదివి వినిపించారని అన్నారు. ఈ హత్యపై త్వరలోనే హైకోర్టును ఆశ్రయస్తామన్నారు. తన భర్త హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని మున్సిపల్ చైర్మన్ లక్ష్మి డిమాండ్ చేస్తున్నారు.