Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల పోరు.. మాజీ ఎమ్మెల్యే వైరాగ్యం...!

By:  Tupaki Desk   |   11 Aug 2019 7:30 PM GMT
త‌మ్ముళ్ల పోరు.. మాజీ ఎమ్మెల్యే వైరాగ్యం...!
X
అది రాష్ట్రంలోనే కీల‌కమైన జిల్లా. ఇక‌ - ఈ జిల్లాలో ఆ నియోజ‌క‌వ‌ర్గం మ‌రింత కీల‌కం. అక్క‌డ పావులు క‌ద‌పాల‌ని ప్ర‌య‌త్నించిన టీడీపీ 2014లో విజ‌యం సాధించింది. ఎమ్మెల్యే పీఠాన్ని ద‌క్కించుకుంది. ఏకంగా 30 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఈ సీటు టీడీపీ ఖాతాలో ప‌డింది. అయితే, ఆ వెంట‌నే స‌ద‌రు ఎమ్మెల్యే త‌మ్ముడి చుట్టూ తెంచుకోలేన‌న్ని కేసులు న‌మోద‌య్యాయి. దీంతో పార్టీకి తీవ్ర క‌ష్టాలు వ‌చ్చిప‌డ్డాయి. అయినా అధికారంలో ఉన్న నేప‌థ్యంలో ఎలాంటి స‌మ‌స్య‌లూ రాలేదు. అయితే, ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ త‌మ్ముడు ఎమ్మెల్యే ఓట‌మి చ‌విచూశారు. దీంతో ఇప్పుడు ఆయ‌న ఎవ‌రి కంటికీ క‌నిపించ‌కుండానే - ఎవ‌రినీ ప‌న్నెత్తు మాట కూడా అన‌కుండానే రాజ‌కీయాలకు ఏకంగా దూర‌మై పోయారు.

మ‌రి ఇంత‌లోనే అంత మార్పు ఎందుకు వ‌చ్చింది? ఎక్క‌డ వ‌చ్చింది? అంటే.. కృష్ణాజిల్లాలోని కీల‌క‌మైన న‌గ‌రం విజ‌య‌వాడ‌కు స‌మీపంలో ఉన్న పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ శ్రేణులు ఇప్పుడు పుట్ట‌కొక‌రు - చెట్టుకొక‌రు అన్న విధంగా ఉన్నారు. ఇక్క‌డ నుంచి గ‌త 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన బోడే ప్ర‌సాద్ వివాదాల‌కు - వివాదాస్పద వ్యాఖ్య‌ల‌కు కేంద్ర బిందువుగా మారారు. ముఖ్యంగా కాల్ మ‌నీ ఉదంతంలో బోడే పేరు బాగా వినిపించింది. ఇక‌ - వైసీపీ నాయ‌కురాలు - ప్ర‌స్తుత ఏపీఐఐసీ చైర్‌ ప‌ర్స‌న్ రోజాపై తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారా ఆయ‌న వివాదానికి కార‌ణ‌మ‌య్యారు.

దీనికితోడు పార్టీలోనే వ‌ర్గ విభేదాలు సృష్టించార‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. త‌న‌కు అనుకూలంగా ఉన్న‌వారితోనే ఆయ‌న ట‌చ్‌లో ఉంటూ వ‌చ్చారు. దీంతో కామ‌య్య‌తోపు - కానూరుల్లోని టీడీపీ శ్రేణులు ఒక వ‌ర్గంగాను, మిగిలిన ప్రాంత‌మంతా మ‌రో వ‌ర్గంగాను మారిపోయింది. ఇదే త‌ద‌నంతర కాలంలో బోడే ఓట‌మికి కార‌ణ‌మైంది. అస‌లు ఎన్నిక‌ల‌కు ముందు ఇక్క‌డ నుంచి పార్టీ యువ‌నేత లోకేష్ కూడా పోటీ చేయాల‌నుకున్నారు. చివ‌రకు బోడేనే ఇక్క‌డ రంగంలోకి దిగి మాజీ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి చేతిలో 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఇక‌, ఇప్పుడు బోడే ఓడిన త‌ర్వాత ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఎక్క‌డా ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించే సాహ‌సం కూడా చేయ‌డం లేదు. టీడీపీ అధికారంలో ఉండ‌గా.. వైసీపీపై దూకుడు ప్ర‌ద‌ర్శించారు. కానీ, ఇప్పుడు మాత్రం మౌనంగా ఉంటున్నారు. అదే స‌మ‌యంలో వ‌ర్గ పోరు మ‌రింత‌గా పెరిగింది. ఇక్క‌డ నాయ‌కుడిని ముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌ను మార్చాల‌ని ర‌గ‌డ ప్రారంభమైంది. ఏదేమైనా ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు టీడీపీకి కంచుకోట‌ - లోకేష్ కూడా పోటీ చేయాల‌నుకున్న నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు పార్టీ కాడి కింద ప‌డేశారు. ఇక్క‌డ పార్టీని ప‌ట్టించుకునే నాథుడే లేడు. మ‌రి బాబు పెన‌మ‌లూరుపై ఎలా స్పందిస్తారో చూడాలి.