Begin typing your search above and press return to search.

కృష్ణా లో పట్టుకోల్పోతున్న టీడీపీ..వంశీ బాటలో మరో ఎమ్మెల్యే!

By:  Tupaki Desk   |   21 Nov 2019 9:40 AM GMT
కృష్ణా లో పట్టుకోల్పోతున్న టీడీపీ..వంశీ బాటలో మరో ఎమ్మెల్యే!
X
కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు ... ఇప్పటికే చావుదెబ్బ తిని ఎలా కోలుకోవాలో తెలియక అయోమయంలో ఉన్న టీడీపీకి మరోసారి వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. టీడీపీ కి చెందిన నేతలే ఆ పార్టీ కి షాక్ ఇస్తుండటం తో అధిష్టానం దిక్కుతోచని స్థితి లో ఉంది. ఎన్నికలలో ఘోర పరాజయం .. ఆ తరువాత రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లడంతో టీడీపీ ఆత్మ రక్షణలో పడింది. ఈ సమయంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ .. పార్టీకి రాజీనామా చేయడం కృష్ణా లో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి.

తాజాగా వంశీ బాటలోనే మరో ఎమ్మెల్యే ప్రయాణించనున్నారా? అనే ప్రశ్నలకు అవుననే వినిపిస్తోంది. దీనితో ఎవరు ఎప్పుడు - ఏ పార్టీలోకి జంప్ అవుతారో అని టీడీపీ ఆందోళనలో చెందుతుంది. తాజాగా వంశీ బాటలో పయనించాలని అనుకుంటున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరంటే .. బోడె ప్రసాద్. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే. తాజాగా జరిగిన ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి పై ఓటమి పాలైయ్యారు. ఈయన పై వల్లభనేని వంశీకి ఆప్తుడిగా ముద్ర ఉంది. అధికారాన్ని కోల్పోయిన తరువాత - అంతకుముందు కూడా వంశీకి పార్టీలో అంతర్గతంగా ఎదురైన కొన్ని అవమానకర సందర్భాలు - పట్టాల పంపిణీ వ్యవహారంలో చోటు చేసుకున్న అవకతవకలు.. ఇవన్నీ దగ్గరుండి చూసిన నాయకుడు కావడం వల్ల వంశీపై సానుభూతి ఏర్పడిందని అంటున్నారు.

వల్లభనేని వంశీ రాజీనామా చేసిన అనంతరం టీడీపీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ మధ్య కొనసాగిన ఆరోపణలు - ప్రత్యారోపణల ఎపిసోడ్ లో బోడె ప్రసాద్ పేరు ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆయన పెద్దగా స్పందించలేదు. దీనిపై ప్రెస్ మీట్ పెట్టి వంశీ పై విమర్శలు గుప్పించాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీచేసినప్పటికీ అయన అందుకు ఒప్పుకోలేదు. వంశీతో ఉన్న స్నేహ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఆయనపై విమర్శలు చేయడానికి ముందుకు రాలేదని సమాచారం. దీనిపై జిల్లా నేతలు అయన పై కొంచెం కోపంగానే ఉన్నారు.

ఈ సమయంలోనే జిల్లా రాజకీయాల్లో తన వ్యతిరేకులను రెచ్చగొట్టే పనిలో పార్టీలోని ఇతర నాయకులు ఉన్నారనే విషయం బోడె ప్రసాద్ దృష్టికి వచ్చిందని అంటున్నారు. వల్లభనేని వంశీ బయటికి వెళ్లిపోవడంతో ఇక తనకు అండగా ఉండే నాయకులు ఎవరూ లేరని అయన ఒక నిర్ణయానికి వచ్చారు. వంశీ రాజీనామా అనంతరం జిల్లా రాజకీయాల్లో చాలా మార్పులు రావడంతో వంశీ బాటలోనే పార్టీకి రాజీనామా చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.