Begin typing your search above and press return to search.

నడిరోడ్డుపై వైరస్ బాధితుడి మృతి: పట్టింపులేని అధికారులు

By:  Tupaki Desk   |   4 July 2020 7:00 AM GMT
నడిరోడ్డుపై వైరస్ బాధితుడి మృతి: పట్టింపులేని అధికారులు
X
వైరస్ పై అధికారులు.. ప్రజల్లో అలసత్వం దారుణంగా ఉంటోంది. వైరస్ పై అప్రమత్తంగా ఉండడం లేదు. దీని ఫలితమే కేసులు భారీగా పెరగడం. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. తాజాగా కర్నాటకలో ఘోర సంఘటన జరిగింది. వైరస్ బాధితుడు గుండెపోటుకు గురయి రోడ్డుపై మృతి చెందాడు. అయితే అతడి మృతదేహం ఏకంగా మూడు గంటల పాటు నడిరోడ్డుపై పడి ఉంది. దీంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

దక్షిణ బెంగళూరుకు చెందిన 64 వృద్ధుడికి పాజిటివ్‌ తేలింది. ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం అతడు గుండెపోటుకు గురయ్యాడు. దీంతో ఆయన వెంటనే అంబులెన్స్‌ కు ఫోన్ చేశారు. అనంతరం అంబులెన్స్‌ కోసం రోడ్డుపైకి వెళ్తుండగా మార్గమధ్యలో మరోసారి గుండెపోటు రావడంతో రోడ్డు మీదే కుప్పకూలాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. వైరస్ బాధితుడు కావడంతో అతడిని పథిశీలించేందుకు కూడా గవరూ ముందుకు రాలేదు. అయితే దీనిపై అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే వారు రావడానికి చాలా ఆలస్యమైంది. దాదాపు మూడు గంటల పాటు ఆ వృద్ధుడి మృతదేహం రోడ్డు మీదనే ఉంది. ఆ తర్వాత అంబులెన్స్‌ అక్కడికి వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లింది.

ఈ ఘటనపై మృతుడి భార్య స్పందించి మీడియాతో మాట్లాడారు. వైరస్ బాధితుడు అని తెలిస్తే... ఇరుగుపొరుగు వారు భయపడతారనే ఉద్దేశంతో తన భర్త ఎవరి సాయం తీసుకోలేదు అని చెప్పారు. అంబులెన్స్‌కు కాల్‌ చేసి రమ్మని చెప్పి రోడ్డు మీదకు వెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు అని వివరించింది.

ఈ ఘటనపై బెంగుళూరువాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బృహన్‌ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ)పై విమర్శలు చేస్తున్నారు. దీంతో సంబంధిత అధికారులు స్పందించారు. కమ్యూనికేషన్‌ లోపంతో అంబులెన్స్‌ సంఘటన స్థలానికి చేరుకోవడంలో ఆలస్యమైందని వివరణ ఇచ్చారు. వర్షాలు పడడంతో మరింత ఆలస్యమైందని తెలిపారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.