Begin typing your search above and press return to search.

ఏడాదిన్నరగా ఇంట్లోనే మృతదేహం..: పెన్షన్ దరఖాస్తుతో వెలుగులోకి..

By:  Tupaki Desk   |   24 Sep 2022 7:23 AM GMT
ఏడాదిన్నరగా ఇంట్లోనే మృతదేహం..: పెన్షన్ దరఖాస్తుతో వెలుగులోకి..
X
ఎవరైనా ఒక మనిషి చనిపోతే కుటుంబ సభ్యులు వచ్చే వరకు ఒకరోజు ఉంచుతారు.. లేదా కనీసం సంబంధిత ఫ్రిజ్ లో ఉంచి వారం పాటు మ్రుతదేహాన్ని నిల్వ చేస్తారు. కానీ అక్కడ ఏడాదిన్నర పాటు శవాన్ని ఇంట్లో ఉంచారు. చాలా రోజులుగా చనిపోయిన వ్యక్తి గురించి అడిగితే కుటుంబ సభ్యలు అర్థం లేని సమాధానాలు చెప్పేవారు.

అయితే ఇటీవల కొందరు స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఓ ఇంట్లో బెడ్ రూం తనిఖీ చేయగా అందులో ఓ మృతదేహం బయటపడింది. బెడ్ కు అతుక్కుపోయిన ఆ మృతదేహాన్ని చూసి పోలీసులు ఖంగు తిన్నారు. ఇంతకీ ఆ వివరాలేంటో చూద్దాం..

ఉత్తరప్రదేశ్ పోలీసులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రాష్ట్రంలోని రావత్ పూర్ జిల్లా శివపురి ప్రాంతానికి చెందిన విమలేశ్ అనే 38 సంవత్సరాల వ్యక్తి ఇన్ కం ట్యాక్స్ విభాగంలో పనిచేసేవాడు. అయితే అతను 2021 ఏప్రిల్ 22న మరణించాడు. కానీ అతడు మరణించిన విషయాన్ని బయటపెట్టలేదు. ఇతరులు అడిగితే విమలేశ్ అనారోగ్యంతో ఉన్నాడని.. కోమాలో ఉన్నాడని చెబుతూ వచ్చారు. విమలేశ్ భార్య స్థానిక కో ఆపరేటివ్ బ్యాంకులో పనిచేస్తోంది.

అయితే భర్త చనిపోవడంతో పెన్షన్ కోసం ఆమె దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తులు విమలేశ్ మరణ ధ్రువపత్రం పెట్టడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఆదాయపు పన్ను శాఖ ఈ విషయాన్ని సీఎంవోకు తెలియజేసింది. వెంటనే రంగంలోకి దిగి ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవలని పోలీసులను ఆదేశించింది. అయితే పోలీసులు అంబులెన్స్ తో విమలేశ్ ఇంటికి వెళ్లి మృతదేహాన్ని చూడగా షాక్ తిన్నారు.

విమలేశ్ మృతదేహం తీవ్రంగా కుళ్లిపోయింది. ఎముకల్లో కనీసం మాంసం కూడా లేకుండా పోయింది. కరోనా కారణంగా 2021లో విమలేశ్ మరణించారు. ఈ తరుణంలో అందరూ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటే వీళ్లు మాత్రం మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఏడాదిన్నరగా ఇంట్లో మృతదేహాన్ని ఉంచి జీవించిన వారిపై తీవ్రవంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ఆ కుటుంబ సభ్యులను అరెస్టు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.