Begin typing your search above and press return to search.

పదో తరగతి విద్యార్థి మూడో తరగతి అబ్బాయిని చంపేశాడు

By:  Tupaki Desk   |   7 Aug 2019 3:38 PM IST
పదో తరగతి విద్యార్థి మూడో తరగతి అబ్బాయిని చంపేశాడు
X
కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ హాస్టల్‌ విద్యార్థి హత్య కేసులో మిస్టరీ వీడింది. హాస్టల్‌ బాత్‌ రూం వద్ద ఆదిత్య రక్తపు మడుగులో అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదిత్యను పదో తరగతి విద్యార్థి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ హాస్టల్‌ లో తన అన్నతో పాటు ఉంటూ ఆదిత్య చదువుకుంటున్నాడు. రోజూ అన్నతో పాటే గదిలో పడుకునే వాడు. సోమవారం రాత్రి గదికి రాకపోవడంతో వేరే గదిలో ఏమైనా నిద్రపోయాడేమోనని అతడి అన్న భావించాడు. కానీ ఉదయం ఆదిత్య బాత్‌ రూంలో నెత్తుటి మడుగులో పడి ఉన్నాడు. గొంతు కోసి హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య ఎవరు చేసి ఉంటారన్న దానిపై పోలీసులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హాస్టల్‌ లో ఉంటున్న పదో తరగతి విద్యార్థే ఆదిత్యను చంపినట్టు తేలింది.

తొలుత ఆదిత్యకు, పదో తరగతి విద్యార్థికి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో తనను ఆదిత్య తిట్టాడని పదో తరగతి విద్యార్థి పోలీసులకు వివరించాడు. రాత్రి 9గంటల సమయంలోనూ మరోసారి తిట్టాడని వెల్లడించాడు. అందుకే ఆదిత్యను చంపేసినట్టు అంగీకరించాడు. పెన్సిల్ చెక్కే చాకుతో ఆదిత్య మెడను కోసినట్టు వివరించాడు. చాకును హత్య చేసిన బాలుడి సూట్‌ కేస్ నుంచి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హత్య చేసిన సమయంలో రక్తం తన బట్టలపై పడడంతో వాటిని కూడా సూట్‌ కేసులో పెట్టి వేరే బట్టలు వేసుకుని ఏమీ తెలియనట్టు నిద్రపోయాడు పదో తరగతి పిల్లాడు. హాస్టల్‌ లో ఆదిత్య హత్య నేపథ్యంలో వాచ్‌ మెన్‌ తో పాటు, హాస్టల్ వార్డెన్‌ ను కలెక్టర్ సస్పెండ్ చేశారు.