Begin typing your search above and press return to search.

బజ్జల మాటల్లో తప్పేముంది?

By:  Tupaki Desk   |   14 April 2015 8:00 AM GMT
బజ్జల మాటల్లో తప్పేముంది?
X
చూసే కన్ను తేడాగా ఉంటే.. ప్రతిది తప్పుగా కనిపిస్తుంటుంది. ప్రస్తుతం తమిళుల పరిస్థితి అలానే ఉంది. తమ వాళ్లు చేసిన పని తప్పుడు పని అన్న విషయాన్ని వదిలేసి.. అడ్డగోలుగా మాట్లాడేయటం అలవాటుగా మారింది. ఆ విషయాన్ని సున్నితంగా చెప్పిన ఏపీ మంత్రి బజ్జల గోపాలకృష్ణారెడ్డి మాటలకు వివాదాస్పదం ట్యాగ్‌ కట్టేసి.. మరింతగా రెచ్చిపోతున్నారు.

శేషాచల అడవుల్లో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో 20 మంది చనిపోవటం.. వారంతా తమిళనాడు ప్రాంతానికి చెందిన వారు కావటంతో కలకలం మొదలైంది. దీనికి తోడు బాధ్యతారాహిత్యంతో.. కేవలం రాజకీయ లబ్థి కోసం ఏపీ సర్కారును తిట్టే పనిని ఏపీ విపక్షాలు మొదలుపెట్టాయి. రాత్రిపూట అక్రమంగా అడవుల్లోకి ప్రవేశించి.. విలువైన ఎర్రచందనం దుంగల్ని కొట్టుకుపోయే వారిని ఏమనాలి? వారిని

నిలువరించే ప్రయత్నం చేసిన పోలీసులు.. అటవీ సిబ్బందిపై గొడ్డళ్లతో.. రాళ్లతో దాడి చేయటాన్ని ఏమనాలి?

ఇలాంటి చాలా ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేరు. కానీ.. అడవుల్లోకి అక్రమంగా ప్రవేశించిన వారు కూలీలు అంటూ కొత్త రాగాన్ని అందుకున్నారు. దొంగతనాలు చేయాలంటూ ఓ వందమందిని పనికి పెట్టుకుంటే వారిని దొంగలు అంటారా? లేక ఉద్యోగులు అంటారా? చేసే పనిని బట్టి.. వారు ఎవరన్నది తేల్చాలే తప్పించి దొంగల్ని కూలీల్ని చేయకూడదు కదా?

ఇలా తెలివిగా ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారు దొంగలు కాదు.. కూలీలన్న వాదనను లోకానికి చాటే ప్రయత్నం చేశారు. దీనికి తోడు ప్రాంతీయవాదాన్ని రేపేలా ఆందోళనలు స్టార్ట్‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గోపాలకృష్ణారెడ్డిని ఒక తమిళ ఛానల్‌ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి దేన్ని సహించమని తేల్చేశారు. అంతేకాదు..

ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని.. ఎవరైనా ఏపీకి పార్యటకులుగా వస్తే ఓకే కానీ.. అటవీ సంపదను కొల్లగొట్టటానికి వస్తే మాత్రం వారి సంగతి చూస్తామని హెచ్చరికలు చేశారు.

దీనిపై తమిళనాడు రాజకీయ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బజ్జల మాటల్ని వివాదాస్పదం చేసేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఎవరికి వారు పట్టించుకోని అంశం ఒకటి ఉంది. అక్రమంగా ఎర్రచందనం దోచుకెళ్లే వారి విషయంలో ఏపీ సర్కారు కఠినంగా వ్యవహరిస్తామనటం తమిళ నాయకులు నచ్చటం లేదా? అన్నది క్లారిటీ ఇవ్వాలి.

బజ్జల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంతో ఉన్నాయని చెబుతున్న వారు.. అసలు ఆయన మాటల్లో అంత బూతు ఏముందో ముందు చెప్పాలి. దొంగలుగా వచ్చి దోచుకెళ్లే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పటం కూడా తప్పేనా? దొంగల్ని.. సంఘ విద్రోహ శక్తులు వెనుకేసుకురావటం కొత్త ట్రెండ్‌గా మారుస్తున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.