Begin typing your search above and press return to search.

యాక్షన్ మోడ్ లో పవన్ : నాదెండ్ల పని అదేనట‌...?

By:  Tupaki Desk   |   4 Aug 2022 3:30 PM GMT
యాక్షన్ మోడ్ లో పవన్ : నాదెండ్ల పని అదేనట‌...?
X
జనసేనలో ఇద్దరే ఇద్దరు నాయకులు ఉన్నారు. వారే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్. ఈ ఇద్దరు నాయకులు తప్ప చెప్పుకోదగిన నాయకులు లేరన్న మాట ఎపుడూ ఉంది. ఇదిలా ఉంటే మరో ఇరవై నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీపరంగా జనసేన పటిష్టం కావాల్సి ఉంది. చేరికలు ఉంటేనే ఊపు వస్తుంది. మరి జనసేనలో ఎందుకు బడా నేతలు చేరడంలేదు అన్న చర్చ వస్తోంది.

అయితే దానికి అనేక కారణాలు ఉన్నాయని, అవరోధాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్న సంగతి విధితమే. తాజాగా గోదావరి జిల్లాలకు చెందిన బొలిశెట్టి శ్రీనివాస్ బహిరంగంగానే నాదెండ్ల మీద విమర్శలు చేశారు. జనసేనలో ఎవరూ చేరకుండా నాదెండ్ల అడ్డుకుంటున్నారు అని ఆయన ఘాటు కామెంట్స్ చేశారు. ఈ రోజుకీ చాలా మంది జనసేనలో చేరాలని ఉత్సాహం చూపిస్తున్నారు అని కూడా అన్నారు.

ఆయన ఒక్కరే కాదు పార్టీని వీడి వెళ్ళిపోయిన సీనియర్లు సైతం జనసేనలో నాదెండ్లకు ఇస్తున్న ప్రయారిటీ మీద కామెంట్స్ చేశారు. ఆయన అటు పవన్ కి ఇటు పార్టీకి మధ్య అడ్డుగోడలా మారారని కూడా అన్నారు. అయితే నాడు పెద్దగా పట్టించుకోని పవన్ కళ్యాణ్ ఇపుడు మాత్రం సీరియస్ గానే అన్నీ చూస్తున్నారు అంటున్నారు.

ఎన్నికలు దగ్గరపడుతున్నా పార్టీకి పెద్ద నేతలు లేకపోవడం లోటుగానే భావిస్తున్నారు. దానితో పాటు నాదెండ్ల వ్యవహారం మీద పార్టీలో వస్తున్న విమర్శలు కామెంట్స్ ని ఆయన పరిగణనలోకి తీసుకున్నారు అంటున్నారు. అందుకే నాదెండ్లని కాస్తా తగ్గించారని అంటున్నారు. ఆయనకు కేవలం పవన్ కళ్యాణ్ పర్యటన బాధ్యతలను మాత్రమే అప్పగించారని తెలుస్తోంది.

నిజానికి నాదెండ్ల జనసేన పార్టీలో రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా ఉంటున్నారు. కానీ ఇపుడు పవన్ టూర్ల షెడ్యూల్ చూసుకోవడమే ఆయన పని అని తేల్చేశారుట. అంటే పార్టీలో అన్నీ కూడా పవన్ చూసుకుంటారు అన్న మాట. అంతే కాదు చేరికల మీద నేరుగా ఆయన ఫోకస్ పెట్టి ఎవరైనా వద్దామనుకుంటే రెడ్ కార్పెట్ పరుస్తారు అని అంటున్నారు.

ఒక విధంగా ఇది మంచి పరిణామమని అంటున్నారు. దిగ్గజ నేతలు కనుక జనసేనలో చేరితే ఆ పార్టీ బలంగా మారుతుంది. అపుడు జనాల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడతాయి. అదే విధంగా పొత్తు బేరాలు ఆడినా లేక జనం వద్దకు వెళ్లి తామె ఆల్టర్నేషన్ అని చెప్పుకున్నా నమ్మే సీన్ ఉంటుంది. మొత్తానికి పవన్ కీలక నిర్ణయం దిశగానే అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. మరి ఇప్పటిదాకా పార్టీలో చేరికలు లేకపోవడానికి నాదెండ్ల మాత్రమే అడ్డంకా లేక పార్టీ మీద ఆసక్తి లేకనా అన్న అనుమానాలకు ఇపుడు తెర పడబోతోంది. పవన్ రంగంలోకి దిగితే చేరే వాళ్ళు ఎవరో కూడా అంతా చూస్తారు అంటున్నారు.