Begin typing your search above and press return to search.

బోళ్ల వార‌సుడు ఎంట్రీ!..మాగంటికి హ్యాండిచ్చేస్తారా?

By:  Tupaki Desk   |   22 Feb 2019 4:07 AM GMT
బోళ్ల వార‌సుడు ఎంట్రీ!..మాగంటికి హ్యాండిచ్చేస్తారా?
X
ఏపీ అసెంబ్లీ - సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు అధికార పార్టీ టీడీపీ నుంచి వైసీపీలోకి భారీ ఎత్తున వ‌ల‌స‌లు జ‌రుగుతుండ‌గా... ఇప్పుడు కొత్త‌గా రాజ‌కీయ తెరంగేట్రం చేస్తున్న యువ నాయ‌క‌త్వంతో టీడీపీకి పెద్ద ఇబ్బందిక‌ర‌మైన వాతావ‌ర‌ణం ఎదురు కానుంద‌న్న విశ్లేష‌ణలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్ప‌టికే చాలా మంది యువ నేత‌ల పేర్లు వినిపిస్తుంటే... ఇప్పుడు తెర‌పైకి మ‌రో కొత్త పేరు వ‌చ్చి చేసింది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కేంద్రం ఏలూరు లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గ బ‌రిలోకి దిగేందుకు ఓ యువ నేత ఆసక్తి చూపిస్తున్నారు. ఈ యువ‌నేత మ‌రెవ‌రో కాదు... కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామ‌య్య మ‌న‌వ‌డు బోళ్ల రాజీవ్‌.

తెలుగు నేలలో పారిశ్రామిక రంగంలో త‌నకంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించిన ముళ్ల‌పూడి హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్ అల్లుడిగానే తెర మీద‌కు వ‌చ్చిన బోళ్ల బుల్లిరామ‌య్య... ఏలూరు పార్ల‌మెంటు కేంద్రంగానే రాజ‌కీయ ఎంట్రీ ఇచ్చారు. తొలి సారే ఏలూరు పార్ల‌మెంటు నుంచి విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నికల్లో అప్పుడ‌ప్పుడే పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన‌ సూప‌ర్ స్టార్ కృష్ణ చేతిలో ఓట‌మిపాల‌య్యారు. ఆ వెంట‌నే జ‌రిగిన త‌దుప‌రి ఎన్నిక‌ల్లో బుల్లిరామ‌య్య కృష్ణ‌ను ఓడించారు. ఆ త‌ర్వాత కేంద్ర మంత్రిగా కూడా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన బుల్లిరామ‌య్య త‌ద‌నంత‌ర కాలంలో రాజ‌కీయాల‌కు పూర్తిగా దూరం జ‌రిగారు. మొత్తంగా అటు పారిశ్రామిక రంగంలోనే కాకుండా రాజ‌కీయ రంగంలోనూ బోళ్ల త‌న‌దైన ముద్ర వేశార‌నే చెప్పాలి.

ఇప్పుడు బోళ్ల బుల్లిరామ‌య్య మ‌న‌వ‌డు రాజీవ్ రాజ‌కీయాల్లోకి పూర్తిగా దిగేస్తున్నారు. త‌న తాత కొన‌సాగిన టీడీపీలోనే తానూ చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న రాజీవ్‌... ఇప్ప‌టికే టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్యద‌ర్శి - ఏపీ కేబినెట్ లో కీల‌క మంత్రిగా ఉన్న నారా లోకేశ్ మ‌ద్ద‌తు కూడా కూడ‌గ‌ట్టుకున్న‌ట్టు స‌మాచారం. లోకేశ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన మ‌రుక్ష‌ణ‌మే రంగంలోకి దిగేసిన రాజీవ్‌.. ఏలూరు వేదిక‌గా రాజ‌కీయం చేసేందుకు వ్యూహం ర‌చించుకుంటున్నారు. అయితే ఇక్క‌డ ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా పార్టీ సీనియ‌ర్ నేత మాగంటి బాబు ఉన్నారు. మాగంటి బాబును వేరే నియోజ‌క‌వ‌ర్గానికి పంపించి అయినా రాజీవ్‌ ను ఎలివేట్ చేయాల్సిందేన‌ని లోకేశ్ భావిస్తున్నార‌ట‌. దీంతో రాజీవ్ వ్యూహం కార‌ణంగా ఈ ఎన్నిక‌ల్లో మాగంటి బాబుకు ఏలూరు పార్ల‌మెంటు టికెట్ ద‌క్కే ప‌రిస్థితి లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. మొత్తంగా రాజీవ్ త‌న పొలిటిక‌ల్ ఎంట్రీని చాలా బ‌లంగానే చాటుకునేందుకు రంగం సిద్ధ‌మైపోయింద‌ట‌.