Begin typing your search above and press return to search.

ప్రముఖులకు ఇదేం పోయేకాలం? తీర్పులు ఇవ్వొద్దంటూ వారు తీర్పులివ్వొచ్చా?

By:  Tupaki Desk   |   6 Oct 2021 5:30 PM GMT
ప్రముఖులకు ఇదేం పోయేకాలం? తీర్పులు ఇవ్వొద్దంటూ వారు తీర్పులివ్వొచ్చా?
X
అనుకుంటాం కానీ.. అన్ని ఒకే గూటి పక్షులు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు బాలీవుడ్ ప్రముఖులు. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కుమారుడు రేవ్ పార్టీలో.. డ్రగ్స్ తో దొరికారన్న ఆరోపణలతో అరెస్టు కావటం తెలిసిందే. అతని వద్ద అధికారులు నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవటం తెలిసిందే. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఉదంతంపై పలువురు సినీ ప్రముఖులు.. బాలీవుడ్ సెలబ్రిటీలు రంగంలోకి దిగి.. ఎవరికి వారు ఆర్యన్ ఖాన్ మంచి బాలుడని.. అతను చిన్న పిల్లాడని పేర్కొంటూ.. తొందరపడి అతడి మీద ముద్రలు వేయటం సరికాదంటూ ట్వీట్లు చేస్తున్న వైనం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

నిజమే.. షారుక్ కు పెద్ద కష్టమే వచ్చి పడింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు.. పెరిగి ప్రయోజకుడిగా పేరు తెచ్చుకోవాల్సిన వేళలో డ్రగ్స్ ఉన్నాయన్న ఆరోపణతో అరెస్టు కావటం ఇబ్బంది కలిగించేదే. తాను ఎంజాయ్ చేయని వాటిని ఎంజాయ్ చేయాలంటూ.. సెక్సు చేయాలని.. డ్రగ్స్ తీసుకోవాలని.. సిగిరెట్లు కాల్చాలంటూ అప్పుడెప్పుడో భార్యతో పాటు కలిసి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సరదాగా చెప్పిన షారుక్ మాటలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఆర్యన్ ఖాన్ తీరు ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

షారుక్ ను ఓదార్చే ప్రయత్నంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు అతనికి అనుకూలంగా ట్వీట్లు చేస్తున్నారు. ఆర్యన్ ఖాన్ తీరును తప్పు పట్టే వారిని మందలిస్తూ వారు ట్వీట్లు చేస్తున్నారు. ఈ తీరు ఇప్పుడు మరింత ఎక్కువైంది. సునీల్ శెట్టి మొదట్ ట్వీట్ చేస్తూ.. ఆర్యన్ ఖాన్ చిన్న పిల్లాడిగా అభివర్ణించారు. షారుక్ కొడుకు వయసు 23 ఏళ్లు. ఈ వయసులో బాధ్యతగా ఉండాల్సిన అతగాడు.. రేవ్ పార్టీలకు హాజరు కావటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

తాజాగా షారుక్ కు మద్దతుగా నిలుస్తున్న వారిలో సల్మాన్ ఖాన్.. పూజ భట్.. హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య సుసానే ఖాన్ లు మద్దతుగా నిలిచారు. ఇలాంటివేళ.. ప్రముఖ నటుడు.. తన సేవా కార్యక్రమాలతో అందరి మనసుల్ని దోచుకున్న సోనూసూద్ ఆర్యన్ పేరును ప్రస్తావించకుండా హిందీలో ఒక ట్వీట్ చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సదరు ట్వీట్ సారాంశాన్ని చూస్తే.. ''పిల్లలు విలువైన వారు. నిజానిజాలు బయటకు రావటానికి కాస్త సమయం పడుతుంది. అప్పుడే మీరు దేవుడిలా పరిస్థితిని మీ చేతిలోకి తీసుకోకండి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఒకరికి ఒకరు అండగా ఉండాలి' అంటూ చేసిన ట్వీట్లను తీవ్రంగా తప్ప పడుతున్నారు.

సోనూ ట్వీట్ నే తీసుకుంటే.. ఆయన చేసిన వ్యాఖ్యలకు భారీ కౌంటర్లు పడుతున్నాయి. నిజానిజాలు బయటకు రావటానికి కాస్త సమయం పడుతుంది.. దేవుడిలా పరిస్థితిని మీ చేతుల్లోకి తీసుకోకండన్న మాటకే వస్తే.. సామాన్యులు చెడ్డవాడన్న ముద్ర వేయటాన్ని తప్పు పడుతున్న సోనూ.. తాను సైతం మంచివాడన్న ముద్ర వేయకూడదు కదా? ఆయన కోసం కాస్త వేచి ఉండాలి కదా? ఎంత తన బడా హీరో అయితే మాత్రం.. సహజ న్యాయసూత్రాన్ని వదిలేసి.. మద్దతు ఇవ్వటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.

ఇక.. క్లిష్ట సమయంలో ఒకరికి ఒకరు అండగా ఉండాలన్న మాట బాగానే ఉన్నా.. అలాంటి మాటలు ఏ సమయంలో.. ఎవరు ఎవరికి ఇవాలన్నది సోనూకు తెలీదా? అన్నది ప్రశ్న. ఒక చెడ్డ పని చేశారన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నప్పుడు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సామాన్యులను చేయని నేరానికి అదుపులోకి తీసుకుంటే అతగాడు తనకున్న పరిమితమైన పరిచయాలతోనే నానా రచ్చ చేస్తాడు. అలాంటిది ఆర్యన్ ఖాన్ విషయంలో అలాంటిదే కుట్ర జరిగి ఉంటే.. షారుక్ కు ఉన్న పలుకుబడికి ఆయన ఊరికే చూస్తూ ఉంటాడా? న్యాయం ఉండి ఉంటే నిస్సహాయంగా ఉండరు కదా?

ఈ చిన్న లాజిక్ ను వదిలేసి.. బాలీవుడ్ ప్రముఖులు చేస్తున్న ట్వీట్లపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అన్నింటికి మించి 23 ఏళ్ల వయసును చిన్నదిగా చేసి చూపించటంపైనా పలువురు మండిపడుతున్నారు. '23 ఏళ్ల వయసులోనే కపిల్‌ దేవ్‌ ఇండియాకు వరల్డ్‌ కప్‌ గెలిచాడు. 23 ఏళ్ల వయసులో నీరజ్‌ చొప్రా ఒలింపిక్స్‌ గెలిచిని ఇండియాకు గోల్డ్‌ మెడల్‌ తెచ్చాడు. 23 ఏళ్ల వయసులోనే సచిన్‌ 1996 వరల్డ్‌ కప్‌ సమయంలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడి రికార్డు సృష్టించాడు. ఇదే 23 ఏళ్లలో భగత్‌ సింగ్‌ దేశం కోసం ప్రాణ త్యాగం చేశాడు. మరీ 23 ఏళ్లకు ఆర్యన్‌ చిన్నపిల్లాడా?' అంటూ ఒక నెటిజన్ విరుచుకుపడిన వైనానికి పలువురు మద్దతు తెలుపుతున్నారు.

ఆర్యన్ ఖాన్ తప్పు చేశాడా? లేదా? అన్నది కోర్టు తేల్చే వరకు సామాన్యుల సంగతి తర్వాత.. ప్రముఖులు కాస్తంత కామ్ గా చూస్తుండిపోవచ్చు కదా? అదేదో పిలుపు ఇచ్చినట్లు ఒకరి తర్వాత ఒకరు ఆర్యన్ ఖాన్ కు మద్దతుగా ట్వీట్లు చేయటం ఏమిటి? చిన్నపిల్లాడిగా అభివర్ణిస్తూ.. అతడ్ని ముద్దు చేయటం ఏమిటి? ఇలాంటి ట్వీట్లతో తమకున్న ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకోవటానికి మించిన పిచ్చి పని ఉండదన్న విషయం ప్రముఖులకు ఎప్పటికి తెలుస్తుందో?