Begin typing your search above and press return to search.

లంకలో క‌ల్లోలం!... భారీ ఉగ్ర‌దాడి - 185 మంది మృతి!

By:  Tupaki Desk   |   21 April 2019 8:52 AM GMT
లంకలో క‌ల్లోలం!... భారీ ఉగ్ర‌దాడి - 185 మంది మృతి!
X
ఈస్ట‌ర్ ప‌ర్వ‌దినాన ప‌క‌డ్బందీగా ఉగ్ర‌దాడి
ఇప్ప‌టిదాకా 185 మంది మృతి - వంద‌ల మందికి గాయాలు
మృతుల్లో 35 మంది విదేశీయులు - వారిలో భార‌తీయులు 11 మంది?
200ల‌కు పైగా చ‌నిపోయారని అనుమానం
తృటిలో త‌ప్పించుకున్న న‌టి రాధికా శ‌ర‌త్ కుమార్‌
ఙంటెలిజెన్స్ హెచ్చ‌రించినా చ‌ర్య‌లు చేప‌ట్ట‌ని లంక స‌ర్కారు
ఐసిస్ ప‌నా?... నేషనల్ త్రోహీత్ జమాత్(ఎన్టీజే) దుశ్చ‌ర్యా?

లంక‌లో నిజంగానే క‌ల్లోలం రేగింది. ఒక‌ప్పుడు త‌మిళ టైగ‌ర్ల కార‌ణంగా నిత్యం క‌ల్లోల ప‌రిస్థితులు త‌లెత్తిన లంక‌లో... ఎల్టీటీఈ అంతంతో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఫ‌లితంగా ఆ దేశ ప‌ర్యాట‌క రంగం కూడా దిన‌దినాభివృద్ధి న‌మోద‌వుతోంది. ఇలాంటి త‌రుణంలో లంక‌లో మ‌రోమారు క‌ల్లోలం చోటుచేసుకుంది. క్రైస్త‌వుల ప‌ర్వ‌దినం ఈస్ట‌ర్‌ను పుర‌స్క‌రించుకుని సామైహిక‌ ప్రార్థ‌న‌ల‌తో లంక రాజ‌ధాని కొలంబోలోని చ‌ర్చీల‌న్నీ దైవారాధ‌న‌తో నిండిపోయాయి. అదే స‌మ‌యంలో ఫారిన్ టూరిస్ట్ ల‌తో స్టార్ హోట‌ళ్లు కూడా క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి... ఇలాంటి ప్ర‌శాంత‌ వాతావ‌ర‌ణాన్ని త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకున్న ఉగ్ర‌మూక‌లు విరుచుకుప‌డ్డాయి. ఒక‌టి కాదు... రెండు కాదు.... ఒకేసారి ఏకంగా ఆరు చోట్ల విరుచుకుప‌డ్డారు. ఫ‌లితంగా ప్రార్థ‌న‌ల‌తో ప్రశాంతంగా ఉన్న చ‌ర్చీలు - స్టార్ హోట‌ళ్లలో ఒక్క‌సారిగా క‌ల్లోలం రేగింది. అప్ప‌టిదాకా క్రీస్తు నామ‌స్మ‌ర‌ణ‌లో ఉన్న చ‌ర్చీల్లో హాహాకారాలు. లంక ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఫారిన్ టూరిస్ట్ ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్న స్టార్ హోట‌ళ్లు ర‌క్త‌సిక్తం అయిపోయాయి. వ‌రుస‌పెట్టి ఆరు చోట్ల ఒకేసారి ఆత్మాహుతి దాడుల‌కు పాల్ప‌డ్డ ఉగ్ర‌వాదులు త‌మ‌ను తాము పేల్చేసుకున్నారు. ఇదీ నేటి ఉద‌యం ల‌కం రాజ‌ధాని కొలంబో స‌హా నెగొంబో, బ‌ట్టిక‌లోవా న‌గ‌రాల్లో చోటుచేసుకున్న ఉగ్ర‌దాడుల తీరు.

నేటి ఉద‌యం 8.45 గంట‌ల స‌మ‌యంలో వ‌రుసపెట్టి ఆరు చోట్ల ఉగ్ర‌దాడులు జ‌ర‌గ‌గా... కాస్తంత గ్యాప్ ఇచ్చి మ‌రో రెండు చోట్ల కూడా ఉగ్ర‌వాదులు విరుచుకుప‌డ్డారు. మొత్తంగా నేటి ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం స‌మ‌యానికే ఉగ్ర‌వాదులు య‌థేచ్ఛ‌గా 8 చోట్ల దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ దాడుల్లో ఇప్ప‌టిదాకా 185 మంది చ‌నిపోయిన‌ట్లుగా లంక ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. మృతుల్లో 35 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో 11 మంది భార‌తీయులు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ దాడుల్లో తీవ్రంగా గాయ‌ప‌డి ఆసుప‌త్రిలో చేరిన వారి సంఖ్య ఇప్ప‌టికే 500 దాటింది. వీరిలో తీవ్ర గాయాల్లో ప్రాణాల‌తో పోరాడుతున్న వారు చాలా మందే ఉన్న‌ట్లుగా స‌మాచారం. వెర‌సి మృతుల సంఖ్య మ‌రింత‌గా పెరిగే ప్ర‌మాదం లేక‌పోలేద‌న్న వార్త‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. అయితే ఉగ్ర‌దాడుల్లో ఇప్ప‌టికే 250 మందికి పైగా చ‌నిపోయి ఉంటార‌ని అన‌ధికారిక స‌మాచారం. ఉగ్ర‌దాడులు జ‌రిగిన మ‌రుక్ష‌ణ‌మే తేరుకున్న లంక స‌ర్కారు అప్ప‌టిక‌ప్పుడే స‌హాయ‌క చ‌ర్య‌ల్లోకి దిగిపోయింది.

అయితే గుడ్ ఫ్రైడే, ఈస్ట‌ర్‌ల సంద‌ర్భంగా ఉగ్ర‌వాద దాడులు జ‌రిగే అవ‌కాశాలున్న‌ట్లు ప‌ది రోజులు ముందుగానే లంక ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు ప్ర‌భుత్వానికి నివేదిక అందించాయ‌ట‌. అయితే వాటిని అంత సీరియ‌స్‌గా ప‌ట్టించుకోని కార‌ణంగా లంక స‌ర్కారు... ఈ హెచ్చ‌రిక‌ల‌ను లైట్ తీసుకుంద‌ట‌. దీంతో ఉగ్ర‌వాదులు తాము రచించుకున్న ప్లాన్ ను ఏమాత్రం అవాంత‌రం లేకుండానే య‌థేచ్ఛగా కొన‌సాగించారు. ఉగ్ర‌దాడులు చోటుచేసుకున్న 8 ప్రాంతాల్లో ఉగ్ర‌వాదులు ఆత్మాహుతి దాడుల‌తోనే చేసిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నా... ఇప్ప‌టిదాకా ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు మాత్ర‌మే త‌మ‌ను తాము పేల్చేసుకున్న‌ట్లు లంక పోలీసులు నిర్ధారించారు. మిగిలిన దాడులు జ‌రిగిన తీరుపై ద‌ర్యాప్తు చేస్తున్నారు. దాడుల నేప‌థ్యంలో శ్రీలంక భద్రతా సిబ్బంది అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తోంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించింది. మరోవైపు ఇవాళ నుంచి సోమవారం సాయంత్రం వరకూ కర్ఫ్యూ విధించింది. అలాగే సోషల్‌ మీడియాపై కూడా లంక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇక పాఠశాలలకు రెండు రోజులు సెలవు ప్రకటించింది. పేలుడు జరిగిన ప్రాంతాల్లో భద్రతా దళాలను మోహరించారు.

ఇదిలా ఉంటే... ప్ర‌స్తుతం కొలంబో టూర్ లో ఉన్న తెలుగు, త‌మిళ నటి రాధిక ఈ ఉగ్ర‌దాడి నుంచి తృటిలో త‌ప్పించుకున్నారు. కొలంబోలోని ఓ హోట‌ల్ లో బ‌స చేసిన రాధిక‌... నేటి ఉద‌యం హోట‌ల్ గ‌దిని ఖాళీ చేసి వెళ్లిపోయార‌ట‌. రాధిక వెళ్లిపోయిన కాసేప‌టికే ఆ హోట‌ల్ పై ఉగ్ర‌దాడి జ‌రిగింది. ఏమాత్రం ఆల‌స్యం అయినా రాధిక కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయే వారే. తాను బ‌స చేసిన హోట‌ల్ పై ఉగ్ర‌దాడి జ‌రిగింద‌ని తెలుసుకున్న రాధిక షాక్ కు గుర‌య్యారు. అయితే తాను దాడికి ముందే హోట‌ల్ ను ఖాళీ చేశాన‌ని, త‌న గురించి ఆందోళ‌న చెందాల్సి అవ‌స‌రం లేద‌ని తెలిపారు. ఇక ఈ ఉగ్ర‌దాడుల‌కు పాల్ప‌డింది ఎవ‌ర‌న్న విష‌యంపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. ఇప్ప‌టిదాకా ఏ ఒక్క ఉగ్ర సంస్థ కూడా ఈ దాడులు త‌మ ప‌నేన‌ని వెల్ల‌డించ‌లేదు. అదే స‌మ‌యంలో ఈ దాడులు ఐసిస్ ప‌నేన‌ని చాలా మంది అనుమానిస్తున్నారు. లంక అధికారులు కూడా ఇదే కోణంలో ద‌ర్యాప్తు ప్రారంభించారు. అయితే ప‌ది రోజుల క్రితం ప్ర‌భుత్వాన్ని అప్ర‌మ‌త్తం చేస్తూ ఇచ్చిన నివేద‌క‌లో లంక ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు నేషనల్ త్రోహీత్ జమాత్(ఎన్టీజే)ను అనుమానించింది. ఈ సంస్థే దాడుల‌కు ప‌థ‌కం ర‌చిస్తున్న‌ట్లుగా ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు చెప్పాయి. అయితే ఇప్పుడు జ‌రిగిన దాడి ఈ సంస్థ ప‌నా? లేదంటే ఐసిస్ ప‌నా? అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త రాలేదు. మొత్తంగా వ‌రుస‌గా 8 చోట్ల ఉగ్ర‌దాడుల‌తో ప్ర‌స్తుతం లంక చిగురుటాకులా వ‌ణికిపోతోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.