Begin typing your search above and press return to search.

షాకింగ్‌: ఫ‌ల‌క్‌నుమాకు బాంబు బెదిరింపు

By:  Tupaki Desk   |   29 Nov 2017 2:12 PM GMT
షాకింగ్‌: ఫ‌ల‌క్‌నుమాకు బాంబు బెదిరింపు
X
అనుకున్నంతా అయింది! హైద‌రాబాద్‌లో ఎలాంటి ఈవెంట్ జ‌రిగినా బాంబు బెదిరింపుల గోల ఎక్కువై పోయింది. దీంతో నిజంగా బాంబులు పెట్టారేమోన‌ని పోలీసులు తీవ్రంగా భ‌య‌ప‌డిపోతున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వం కూడా హ‌డ‌లి పోతోంది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అంత‌ర్జాతీయ పారిశ్రామిక వేత్త‌ల స‌ద‌స్సును ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. దీనికి అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ప్ర‌త్యేక అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ క్ర‌మంలో ఆమెకు ఆమె ప‌రివారానికి ప్ర‌తిష్టాత్మ‌క ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌ను ఆతిథ్య మందిరంగా కేటాయించారు. అదేవిధంగా హైద‌రాబాద్‌లోని స్టార్ హోట‌ళ్ల‌ను కూడా బుక్ చేశారు. అయితే, ఉగ్ర వాద జాబితాలో హైద‌రాబాద్ న‌గ‌రం ఉండ‌డంతో పోలీసులు భారీ ఎత్తున భ‌ద్ర‌త క‌ల్పించారు. అదేస‌మ‌యంలో అమెరికా పోలీసులు కూడా త‌మ జాగిలాల‌ను తెచ్చి అణువ‌ణువూ క్షుణ్ణంగా త‌నిఖీ చేశారు.

అంతా బాగుంద‌ని, భ‌ద్ర‌త‌కు ఢోకా లేద‌ని తేల్చుకున్నాకే ఇవాంకాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. దీనిని ప్ర‌భుత్వం కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. మొత్తం ఆరు జిల్లాల పోలీసుల‌ను ఇవాంకా భ‌ద్ర‌త‌కు కేటాయించారు.అంటే ఆమె సంచ‌రించే ప్రాంతాల్లో అడుగుకో పోలీస్‌ను ఏర్పాటు చేశారు. అంతా బాగుంద‌ని సీఎం కేసీఆర్ గుండెల‌పై చేయివేసుకున్న మ‌రుక్ష‌ణంలోనే పోలీసులు ఊహించిందే జ‌రిగింది. ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌కు బాంబు పెట్టామ‌ని, అది ఏక్ష‌ణంలోనైనా పేలుతుంద‌ని హెచ్చ‌రిస్తూ.. ఓ అజ్ఞాత వ్య‌క్తి ఏకంగా తెలంగాణ డీజీపీ ఆఫీస్‌కే ఫోన్ చేసి వెల్ల‌డించ‌డం పోలీసు వ‌ర్గాల్లో తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది.

అయితే, పోలీసులు ఈ విష‌యాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. ఈ వార్త మీడియాకు పొక్కితే.. తీవ్ర అల‌జ‌డి రేగుంద‌ని భావించారో ఏమో.. అత్యంత ర‌హ‌స్యంగా బాంబు విష‌యంలో త‌నిఖీలు చేప‌ట్టారు. ఫలక్‌ నుమా ప్యాలెస్‌లో బాంబు ఉన్నట్లు నిన్న రాత్రి (మంగళవారం) 9.45 గంటలకు డీజీపీ క్యాంప్‌ కార్యాలయానికి ఓ బెదిరింపు ఫోన్‌ కాల్ వచ్చింది. ఫలక్‌ నుమా పరిసరాల్లో బాంబు పెట్టామని, ఏ నిమిషంలో అయినా పేలుతుందంటూ ఆగంతకుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి, నిన్న రాత్రంతా తనిఖీలు నిర్వహించారు. ఈ స‌మ‌యంలో మీడియాకు కూడా ఈ అనుమానం రాలేదు. స‌హజంగానే భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేసిన నేప‌థ్యంలో ఇలాంటి దాడులు కామ‌నే అనుకుంది. తనిఖీల అనంతరం దాన్ని బెదిరింపు కాల్‌గా పోలీసులు గుర్తించారు.

కాగా ఇంటర్నెట్‌ వాయిస్‌ కాల్‌ ద్వారా దుండగుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతగాడి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇక‌, ఫలక్‌ నుమా ప్యాలెస్‌లో బాంబు పెట్టినట్లు వచ్చిన బెదిరింపు కాల్‌ వ్యవహారంపై కేసీఆర్‌ ప్రభుత్వం తీవ్ర‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. బెదిరింపు ఫోన్‌ కాల్‌పై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. అంతేకాకుండా ఈ ఘటనకు పాల్పడినవారిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా ఈ ఫోన్‌ కాల్‌ పాతబస్తీ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇవాంకా ట్రంప్‌ పర్యటన ముగియగానే పోలీసులు విచారణ చేపట్టనున్నారు. మొత్తానికి హైద‌రాబాద్ అంటే ఆట‌లైపోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ విచార‌ణ ఎప్ప‌టికి తేలుతుందో చూడాలి.