Begin typing your search above and press return to search.

బొమ్మన రాజన్న కేరాఫ్ మంచిర్యాల అఫ్గాన్ లో ఎలా చిక్కుకుపోయాడు

By:  Tupaki Desk   |   18 Aug 2021 5:30 AM GMT
బొమ్మన రాజన్న కేరాఫ్ మంచిర్యాల అఫ్గాన్ లో ఎలా చిక్కుకుపోయాడు
X
ఎవరికెన్ని పనులున్నా.. మరే విషయాల్లో బిజీగా ఉన్నా.. యావత్ ప్రపంచం కన్ను ఒకటి ఇప్పుడు అఫ్గాన్ మీద ఉంది. అక్కడి పరిస్థితులు.. చోటు చేసుకుంటున్న పరిణామాల మీద ఆందోళన వ్యక్తమవుతోంది. వారి బతుకులు బాగుపడాలని.. ఇప్పుడున్న ఆందోళనలు తగ్గాలని.. వారి జీవితాలు చీకటిమయం కాకూడదని ప్రార్థిస్తున్న వారెందరో. అల్లంత దూరాన ఉన్న అఫ్గాన్ల కోసం అంతలా తల్లడిల్లిపోతున్న వేళ.. మనోడు ఒకరు అక్కడ చిక్కుకుపోయారంటే ఉండే అందోళన ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.

మంచిర్యాల పట్టణానికి చెందిన బొమ్మన రాజన్న అఫ్గానిస్తాన్ లో గడిచిన ఎనిమిదేళ్లుగా ఉంటున్నారు. రాజధాని కాబూల్ లోని ఏసీసీఎల్ సంస్థలో పని చేస్తున్నాడు. గత జూన్ లో మంచిర్యాలకు వచ్చిన ఆయన మళ్లీ అఫ్గాన్ కు ఈ నెల ఏడునే అక్కడకు వెళ్లారు. ఇటీవల కాలంలో మారిన పరిస్థితుల నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో రాజన్న తిరిగి వచ్చేయాల్సి ఉంది. ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసేశారు కూడా. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు అఫ్గాన్ లో ఆయన చిక్కుకుపోయారు.

కాబూల్ తో సహా దేశమంతా తాలిబన్ల వశమైన నేపథ్యంలో అక్కడ భయానక వాతావరణం నెలకొని ఉందని.. బయటకు వచ్చేందుకు వీలు కాని పరిస్థితులు ఉన్నట్లు చెబుతున్నాడు. ప్రస్తుతం తనతో పాటు కరీంనగర్ జిల్లా ఒడ్డారానికి చెందిన వెంకన్న కూడా ఉన్నారని.. తామిద్దరం ఆగస్టు 18న (గురువారం) ఇండియాకు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి. అంతలోనే పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నట్లు ఆయన చెబుతన్నారు. టికెట్లు చేతిలో ఉన్నా.. విమానాలు లేవని.. తిరిగి వచ్చేందుకు దారులు మూసుకుపోయినట్లు చెబుతున్నారు.

తాజాగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన రాజన్న.. తనను తిరిగి తీసుకురావటానికి భారత ప్రభుత్వం సాయం చేయాల్సిందిగా కోరుతున్నారు. అఫ్గాన్ లో భారత్ కు చెందిన పలువురు ప్రజలు ఉన్నారు. వారందరిని స్వదేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. తెలుగోళ్ల క్షేమం గురించి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.