Begin typing your search above and press return to search.

పెన్ డౌన్ మాటతో దిగొచ్చి సారీ చెప్పిన తమ్ముళ్లు

By:  Tupaki Desk   |   26 March 2017 9:47 AM GMT
పెన్ డౌన్ మాటతో దిగొచ్చి సారీ చెప్పిన తమ్ముళ్లు
X
ఏపీలో అధికారపక్ష నేతలు వ్యవహరిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ఐజీ స్థాయి అధికారిపై నేతలు దాడికి పాల్పడినంత హడావుడి చేసి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. ఆయన్ను రోడ్డు మీద నిలబెట్టినట్లుగా చేసిన వైనంపై ఉద్యోగ సంఘాలు తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేతున్నాయి. ఉన్నతాధికారిపై టీడీపీ ఎంపీ.. ఎమ్మెల్యేలు దాడికి పాల్పడిన ఉదంతంపై అధికారులు భగ్గుమంటున్నారు.

ఐపీఎస్ అధికారి.. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యంకు ఉద్యోగ సంఘాలు సంఘీభావాన్ని ప్రకటించాయి. అంతేకాదు..ఆయనపై దాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ కేశినేనినాని.. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు.. బుద్ధా వెంకన్నలపై చర్యలు తీసుకోవాలంటూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక ఐపీఎస్ అధికారిపై దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు.

ఈమధ్యన ఆటోనగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన నివేదికను మార్చాలని కొందరు తెలుగు దేశం పార్టీ నేతలు ఒత్తిడి తీసుకురావటం..దీనికి రవాణాశాఖ కమిషనర్ నో చెప్పటంతో.. ఆయనపై దాడికి పాల్పడినట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎంపీ కేశినేని నానిపై అధికారులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక బస్సు ప్రమాదానికి సంబంధించి మరో ఆపరేటర్ అయిన ఎంపీ కేశినేని నాని జోక్యం చేసుకోవటం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు.ఆటో నగర్ దగ్గర ప్రమాదానికి గురైన బస్సు మరో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందింది కావటం గమనార్హం.

రవాణా శాఖ కమిషనర్ పై దాడి ఘటనపై స్పందించిన ఎంపీ కేశినేని నాని.. బోండా ఉమామహేశ్వరరావులు స్పందించారు. జరిగిన దానిపై విచారం వ్యక్తం చేస్తూ.. తాము దాడికి పాల్పడలేదన్నారు. జరిగిన ఘటనపై తమ తప్పులుంటే క్షమాపణలు చెప్పేందుకుతాము సిద్ధమని..పార్టీ అధినేత.. సీఎం చంద్రబాబు ప్రతిష్ఠే తమకు ముఖ్యమన్నారు. ఇదిలా ఉంటే..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ కేశినేని నాని.. ఎమ్మెల్యే బోండా ఉమాలు ఇద్దరూ క్షమాపణలు చెప్పటం గమనార్హం. జరిగిన ఉదంతంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యంపై దాడికి పాల్పడిన ఉదంతంపై భేటీ అయిన కేశినేని నాని.. బోండాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా మందలించినట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/