Begin typing your search above and press return to search.

లిక్క‌ర్ బాటిళ్ల‌ను ప‌క్క‌న పెట్టుకుని..మాజీ టీడీపీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్!

By:  Tupaki Desk   |   3 March 2020 10:32 AM GMT
లిక్క‌ర్ బాటిళ్ల‌ను ప‌క్క‌న పెట్టుకుని..మాజీ టీడీపీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్!
X
ప్రెస్ మీట్ ల‌తో హ‌డావుడి చేయ‌డంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న నైపుణ్యం అంతా ఇంతా కాదు. తెలుగుదేశం పార్టీ ప్రెస్ మీట్లు అంటేనే.. అదంతా ఒక కార్పొరేట్ స్టైల్ ఆఫ్ వ్య‌వ‌హారం. త‌మ ప్రెస్ మీట్ల‌కు విప‌రీత‌మైన ప్ర‌చారం తెచ్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ ర‌క‌ర‌కాల ఎత్తుగ‌డ‌ల‌ను వేస్తూ ఉంటుంది. ఇదంతా పాత క‌థే.

అయితే ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షంలో ర‌క‌ర‌కాల ఫీట్ల‌ను చేస్తున్న తెలుగుదేశం పార్టీ.. మ‌రో కొత్త ప్ర‌య‌త్నం చేసింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు త‌న తాజా ప్రెస్ మీట్ కు వివిధ బ్రాండ్ల మ‌ద్యం బాటిళ్ల‌తో వ‌చ్చారు! వాటిని చూపిస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఆయ‌న విమ‌ర్శించారు! ఇంత‌కీ క‌థేమిటంటే.. ఏపీలో ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న మ‌ద్యం దుకాణాల్లో పేరున్న బ్రాండ్లు దొర‌క‌డం లేదు అనేది బోండా ఉమ కంప్లైంట్!

అన్నీ త‌క్కువ స్థాయి బ్రాండ్ల‌ను ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాల్లో అమ్ముతున్నార‌ని ఆయ‌న వాపోయారు. పేరున్న బ్రాండ్లు దొర‌క‌డం లేద‌ని ఆరోపించారు. అందుకు రుజువులుగా.. డైరెక్టుగా మ‌ద్యం బాటిళ్ల‌ను తీసుకొచ్చారు. వాటిపై బ్రాండ్ల పేర్ల‌ను చూపించారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అలాంటి అనామాక బ్రాండ్ల‌ను మ‌ద్యం షాపుల్లో అమ్మ‌కానికి ఉంచింద‌ని, ఇదంతా క‌మిష‌న్ల కోస‌మే అని బోండా ఉమ ఆరోపించారు. క‌మిష‌న్లు తీసుకుని... కొన్ని ర‌కాల మ‌ద్యం బ్రాండ్ల‌నే అమ్మ‌కానికి ఉంచుతున్నార‌ని ఆరోపించారు. ఇలాంటి మ‌ద్యం తాగి సామాన్యులు ఇబ్బంది ప‌డుతూ ఉన్నార‌ని ఆయ‌న అన్నారు.

ఈ విష‌యంలో ఇప్ప‌టికే చంద్ర‌బాబు నాయుడు కూడా మాట్లాడారు. ఏపీలో మంచి మంచి బ్రాండ్ల మ‌ద్యం దొర‌క‌డం లేద‌ని ఆయ‌న ఆరోపించారు. అయితే అంత‌టితో ఆగ‌క తెలుగుదేశం పార్టీ వాళ్లు ఇలా ప్రెస్ మీట్లు పెట్టి.. బ్రాండ్ల‌ను ప్ర‌దర్శించారు.

అయితే తెలుగుదేశం పార్టీ మ‌ద్యానికి ఇలా బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మార‌డం ఏ మేరకు స‌బ‌బు అనేది ఆలోచించాల్సిన అంశం. ఒక‌వైపు ఏపీలో మ‌ద్యాన్ని తీవ్రంగా క‌ట్ట‌డి చేశారు. బెల్టు షాపుల ఊసు లేదు. మ‌ద్యం అమ్మ‌కాల విష‌యంలో చాలా ప‌రిమితులు పెట్టారు. ఇలాంటి నేప‌థ్యంలో.. తెలుగుదేశం మ‌ద్యం దొర‌క‌డం లేదు, అందునా బ్రాండెడ్ లిక్క‌ర్ దొర‌క‌డం లేదు.. అని గ‌గ్గోలు పెట్ట‌డం నెగిటివ్ ప‌బ్లిసిటీ అయ్యే అవ‌కాశాలు లేక‌పోలేదు. ద‌శ‌ల‌వారీగా మొత్తం మ‌ద్యాన్నే నిషేధించేలా ఉన్నారు ఏపీలో. ఇలాంటి నేప‌థ్యంలో ఇలా టీడీపీ నేత‌లు ఎందుకు మ‌ద్యంతో గోక్కుంటున్నారో!