Begin typing your search above and press return to search.

కామ‌ర్స్‌లో పిజిక్స్‌కు... ఇది ప‌రాకాష్టే!

By:  Tupaki Desk   |   7 March 2017 4:27 AM GMT
కామ‌ర్స్‌లో పిజిక్స్‌కు... ఇది ప‌రాకాష్టే!
X
కామ‌ర్స్ లో ఫిజిక్స్ ఉంద‌ని విచిత్ర కామెంట్ చేసిన టీడీపీ జంపింగ్ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్... ఏ స‌మ‌యాన ఆ మాట‌న్నారో గానీ... ఎక్క‌డ చూసినా అదే జోకు ట‌పాసులా పేలిపోతోంది. అస‌లు ఏమాత్రం ప్ర‌చారం లేకుండానే ఈ కామెంట్ జ‌నానికి బాగానే ఎక్కేసింది. వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన జ‌లీల్ ఖాన్‌... ఆ త‌ర్వాత కండువా మార్చేసి టీడీపీలో చేరిపోయారు. త‌న‌దైన నేటివిటీలో కాస్తంత వెట‌కారం తొంగి చూసేలా ఆయ‌న మాట్లాడే తీరే ఆశ్చ‌ర్యంగా ఉంటుంది. అలాంటిది ఆయ‌న నోట‌ కామ‌ర్స్ లో ఫిజిక్స్ ఉంద‌నే కామెంట్ వ‌స్తే జ‌నం ఎందుకు వ‌దులుతారు చెప్పండి. జ‌లీల్ ఖాన్ చాలా రోజుల క్రిత‌మే ఈ మాట అన్నా... ఇప్ప‌టికీ ఇది హాట్ జోకుగానే పేలుతోంది.

ఇక ప్ర‌స్తుత విష‌యానికి వ‌స్తే... న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధానిలో కొత్త‌గా నిర్మించిన అసెంబ్లీ భ‌వ‌నంలో నిన్న తొలి స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. విజ‌య‌వాడ‌కు చెందిన టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు స‌హా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌రులు కూడా చాలా సంద‌డే చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల‌పై నిత్యం విరుచుకుప‌డే మ‌న‌స్త‌త్వ‌మున్న బొండా... కొత్త అసెంబ్లీలో అందుకు కాస్తంత భిన్నంగా క‌నిపించారు. అసెంబ్లీ స‌మావేశాలు ముగిసిన త‌ర్వాత మీడియా పాయింట్ వ‌ద్ద ఆయ‌న వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డితో న‌వ్వుతూ తుళ్లుతూ ముచ్చ‌టిస్తూ క‌నిపించారు.

ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడేందుకు వ‌చ్చిన‌ ఆయ‌న‌ను జ‌లీల్ ఖాన్ ఆవ‌హించిన‌ట్లున్నారు. మార్చి 6న ప్రారంభ‌మైన స‌మావేశాలు అని చెప్పే బ‌దులుగా ఫిబ్ర‌వ‌రి 6న‌ అని చెప్పేశారు. ఈ విష‌యాన్ని ఎవ‌రూ అంత‌గా ప‌ట్టించుకోకున్నా... ఆయ‌న మాట‌ల‌కు కాస్తంత పరిశీల‌న‌గా విన్న కొంద‌రు మీడియా మిత్రులు మాత్రం బొండా ఉమా... తేదీని త‌ప్పుగా చెప్పేసిన వైనాన్ని గ‌మ‌నించేశారు. అదేంటీ మార్చి నెల‌ను బొండా ఫిబ్ర‌వ‌రి నెల‌గా చెబుతున్నారు. జ‌లీల్ ఖాన్ ఆయ‌న‌ను ఆవ‌హించిన‌ట్లుగా ఉందే అని వారంతా బొండాపై జోకులేసుకున్నారు.

ఇదిలా ఉంటే అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌స‌గించేందుకు వ‌చ్చిన గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ కూడా అసెంబ్లీ స‌మావేశాల ప్రారంభ తేదీని త‌ప్పుగా ప‌లికారు. మార్చి 6 అని చెప్పాల్సిన ఆయ‌న‌... అందుకు భిన్నంగా మార్చి 5న నూత‌న అసెంబ్లీలో తొలి సమావేశాల‌ను ప్రారంభించుకోవ‌డం గ‌ర్వంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. ఈ విష‌యాన్ని కూడా మెజారిటీ మంది గ‌మ‌నించక‌పోయినా.. చాలా మంది గ‌వర్న‌ర్ నోట‌ట త‌ప్పు దొర్లిన విష‌యాన్ని గుర్తించి లోలోప‌లే న‌వ్వుకున్నార‌ట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/