Begin typing your search above and press return to search.

అప్పుడు మాటలన్నీ మర్చిపోయారా బోండా ఉమ?

By:  Tupaki Desk   |   12 Jun 2016 4:23 AM GMT
అప్పుడు మాటలన్నీ మర్చిపోయారా బోండా ఉమ?
X
ఏపీ తెలుగుదేశానికి సంబందించి నోటి దురుసు ఎక్కువగా ఉన్న నేతల్లో విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమ ఒకరు. ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచినప్పటికీ పెద్ద గొంతేసుకొని.. తెచ్చి పెట్టుకున్న ఆవేశంతో వైరిపక్షం మీద ఊగిపోయే బోండా ఉమ మాటలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఆయన మాటల్లో లెక్క తరచూ మారిపోతూ ఉంటుంది. స్వల్ప వ్యవధిలో ఆయన నోటి నుంచి వచ్చిన మాటల్లో తేడా చూస్తేనే.. ఆయన తీరు ఏమిటో ఇట్టే అర్థమైపోతుంది.

కొద్ది రోజుల క్రితం ముద్రగడ దీక్ష చేస్తే.. ఆయన్ను అరెస్ట్ చేస్తామంటూ హడావుడి మాటలు చెప్పిన బోండా ఉమ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ఆచితూచి మాట్లాడుతున్నారు. ఏపీ రాష్ట్ర హోంమంత్రి చెప్పిన మాటలకు భిన్నమైన మాటలు ఆయన నోటి నుంచి రావటం విశేషం. తుని ఘటనలో నిందితులుగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలంటూ దీక్ష చేస్తున్న ముద్రగడ కారణంగా భావోద్వేగాలు పెరుగుతున్న నేపథ్యంలో బోండా స్వరం మారింది.

ముద్రగడను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు అనుచితంగా వ్యవహరించలేదంటూ హోంమంత్రి చినరాజప్ప స్పష్టం చేస్తుంటే.. అందుకు భిన్నంగా మాట్లాడుతున్న బోండా ఉమ.. ముద్రగడ ఇష్యూలో దూకుడుగా వ్యవహరించిన వారి విషయంలో ప్రభుత్వం చర్య తీసుకుంటుందని చెప్పటం గమనార్హం. అయినా పోలీసులకు సంబంధించి హోంమంత్రి స్వయంగా చెప్పిన తర్వాత బోండా అందుకు భిన్నమైన మాటను చెప్పాల్సిన అవసరం ఉందా? ఇలాంటి మాటలు ప్రభుత్వానికి డ్యామేజింగ్ గా మారతాయన్న విషయం బోండా గుర్తిస్తే బాగుంటుందన్న భావన వ్యక్తమవుతోంది.