Begin typing your search above and press return to search.

మేయ‌ర్ హ‌త్య‌కు కాపుల‌కు లింకు పెట్టిన ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   17 Nov 2015 10:07 AM GMT
మేయ‌ర్ హ‌త్య‌కు కాపుల‌కు లింకు పెట్టిన ఎమ్మెల్యే
X
చిత్తూరు జిల్లాలో దారుణం జ‌రిగింది. న‌గ‌ర‌ మేయర్ అనూరాధ‌ను గుర్తు తెలియ‌ని దుండగులు హత్య‌చేశారు. ఈ సంఘ‌ట‌న‌పై విజ‌య‌వాడ సెంట్ర‌ల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు తీవ్రంగా స్పందించారు. వైకాపా నేత‌ల‌పై ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కాపు సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో... ఆ వర్గానికి చెందిన ఒక నేత ఎదుగుతున్న సమయంలో... టీడీపీ నేత కటారి అనూరాధ హత్య‌కు గుర‌వడం దారుణ‌మ‌ని బొండా ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం చిత్తూరు మేయ‌ర్ కఠారి అనురాధ - ఆమె భర్త క‌ఠారి మోహ‌న్‌ పై గుర్తుతెలియని దుండగులు దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో అనురాధ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. ఒక ఆడపడచు మేయ‌ర్‌ గా బాధ్య‌తలు నిర్వహిస్తున్న సమయంలో.. వైకాపా నేత‌లు ఇలాంటి దారుణానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. మోహన్ కు, మాజీ ఎమ్మెల్యే సి.కె.బాబు వర్గాలకు మధ్య విభేదాలు ఉన్నా ఓ మహిళను హత్య చేయడం ద్వారా వైకాపా నాయ‌కుల‌కు మ‌హిళ‌లంటే ఎలాంటి భావ‌న ఉందో అర్థ‌మ‌వుతోంద‌న్నారు.

సీకే బాబు ప్ర‌స్తుతం వైకాపాలో ఉన్నారంటూ...ఈ హ‌త్య వెన‌క ఆయ‌న ప్ర‌మేయాన్ని ఊటంకిస్తూ బొండా మాట్లాడారు. ఈ హత్య వెనుక ఉన్న అసలు వ్యక్తు లెవరో నిగ్గు తేలాలని ఉమ డిమాండ్ చేశారు. ఎస్పీ ఆఫీస్‌ కు ద‌గ్గ‌ర్లోనే ఉన్న కార్పొరేష‌న్ కార్యాల‌యంలో ఈ హ‌త్య జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. ఇదిలా ఉంటే చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై గతంలో జరిగిన హత్యాయత్నం కేసులో కఠారి మోహన్ ప్రధాన నిందితుడు. మేయర్ కుటుంబ సభ్యులు ఎవరూ ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు ఇష్టపడట్లేదు. కుటుంబ కలహాలు కూడా కారణం అయి ఉండొచ్చని పోలీసులు విశ్వసిస్తున్నారు.