Begin typing your search above and press return to search.

ఎందుకంటే?; బొంతుకు ఈ-చలానా రద్దు చేశారు

By:  Tupaki Desk   |   1 April 2016 7:41 AM GMT
ఎందుకంటే?; బొంతుకు ఈ-చలానా రద్దు చేశారు
X
హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన ఆరోపణ మీద గ్రేటర్ పోలీసుల నుంచి ఈ-చలానా అందుకున్న గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ స్పందించారు. తాను హెల్మెట్ పెట్టుకొనే వాహనం నడిపినట్లుగా ఆయన పేర్కొన్నారు. అర్థరాత్రి వేళ పారిశుధ్ద్యం ఎలా జరుగుతుందన్న అంశాన్ని స్వయంగా తనిఖీ చేసేందుకు బుధవారం అర్థరాత్రి వేళ ఆకస్మిక తనిఖీలు చేయటం.. ఇందుకోసం ద్విచక్రవాహనం మీద ఆయన ప్రయాణించటం తెలిసిందే.

ఇలా జర్నీ చేస్తున్న ఫోటోలు మీడియాలో అచ్చయ్యాయి. అయితే.. టూవీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను మేయర్ ఉల్లంఘించారన్న విమర్శలు వచ్చాయి. నిబంధనల్ని పాటించని సామాన్యుడిపై జరిమానా మోత మోగించే హైదరాబాద్ పోలీసులు మేయర్ ఇష్యూను వదిలేస్తారా? అన్న ప్రశ్నల వెల్లువెత్తుతున్న వేళ.. పోలీసులు ఆయనకు ఈ-చలనా పంపేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ఈ-చలానాను పంపినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.

అయితే.. ఈ ఉదంతంపై మేయర్ కార్యాలయం వివరణ ఇచ్చింది. ఆకస్మిక తనిఖీల కోసం మేయర్ హెల్మెట్ ధరించే ప్రయాణించారని.. కాకుంటే ఫోటోలకు ఫోజులు ఇచ్చేందుకు వీలుగా హెల్మెట్ తీయాలంటూ మీడియా ప్రతినిధులు కోరిన మీదట ఆయన హెల్మెట్ తీశారే తప్పించి.. ఆయన హెల్మెట్ ధరించారంటూ అందుకు సంబంధించిన ఫోటోల్ని పోలీసు వర్గాలకు చూపించినట్లు పేర్కొన్నారు. ఈ ఆధారాల్ని పరిశీలించిన మీదట.. మేయర్ బొంతుకు పంపాలని భావించిన ఈ-చలానాను రద్దు చేసినట్లుగా ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. మొత్తానికి ఫోటోలకు ఫోజులివ్వటం ఇంత రచ్చకు కారణంగా చెప్పొచ్చు.