Begin typing your search above and press return to search.

మేయర్ బొంతుకు పోలీసుల ఈ -చలానా

By:  Tupaki Desk   |   31 March 2016 3:42 PM GMT
మేయర్ బొంతుకు పోలీసుల ఈ -చలానా
X
హైదరాబాద్ పోలీసులు తమ కమిట్ మెంట్ ను ప్రదర్శించారు. సామాన్యులకు ఒక రూలు.. వీవీఐపీలకు మరో రూల్ అన్న వ్యత్యాసం తమకు లేదని తేల్చారు. తప్పు చేసిన ఎవరినైనా.. నిబంధనల్ని అతిక్రమించిన వారు ఎవరైనా.. ఏ స్థాయి వారైనా వారికి చట్టబద్ధమైన చర్యలు తప్పవన్న విషయాన్ని తేల్చేశారు.

రోడ్డు ప్రమాదాల్ని అరికట్టేందుకు వీలుగా డ్రైవింగ్ లైసెన్సుల మీదా.. హెల్మెట్ ధరించాలన్న అంశం మీద హైదరాబాద్ పోలీసులు కఠిన నిబంధనల్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. వారి కమిట్ మెంట్ ను ప్రశ్నించే రీతిలో ఒక ఘటన చోటు చేసుకుంది. గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్.. పారిశుద్ధ్యం మీద ఆకస్మిక తనిఖీ నిర్వహించేందుకు వీలుగా బుధవారం రాత్రి బుల్లెట్ మీద గ్రేటర్ లోని పలు ప్రాంతాల్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయనే స్వయంగా ద్విచక్రవాహనాన్ని నడిపారు. అయితే.. వాహనాన్ని నడిపే క్రమంలో ఆయన హెల్మెట్ పెట్టుకోకుండానే డ్రైవ్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సామాన్యులు కానీ ఇలాంటి తప్పులే చేస్తే.. చలానాలు విధించే నగర పోలీసులు.. మేయర్ విషయంలో చూసీ చూడనట్లుగా వ్యవహరించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే.. హెల్మెట్ పెట్టుకోకుండా ద్విచక్ర వాహనాన్ని నడిపిన మేయర్ కు తాజాగా పోలీసులు ఈ-చలానా పంపినట్లుగా చెబుతున్నారు. ఆయన ఇంటికి చలానా పంపటం ద్వారా నిబంధనల విషయంలో తమ కమిట్ మెంట్ ను ఎవరూ ప్రశ్నించలేరన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెప్పొచ్చు.