Begin typing your search above and press return to search.

ప్ర‌థ‌మ పౌరుడిపై జ‌రిమానా!.. బొంతు స్పంద‌న భేష్‌!

By:  Tupaki Desk   |   3 Feb 2019 7:44 AM GMT
ప్ర‌థ‌మ పౌరుడిపై జ‌రిమానా!.. బొంతు స్పంద‌న భేష్‌!
X
ప్ర‌జా చైత‌న్యం ఏ మేర స‌త్తా చాటుతున్న‌ద‌న‌డానికి ఇది నిలువెత్తు నిద‌ర్శ‌నమ‌నే చెప్పాలి. చ‌ట్టాలు ఏ ఒక్క‌రికీ చుట్టం కాద‌ని, ఎంత‌టి వారైనా ఆ చ‌ట్టం ముందు త‌ల వంచాల్సిందేన‌ని ఈ ఘ‌ట‌న నిరూపించింది. అంతేనా... ఈ న‌గ‌రానికి తాను ప్ర‌థ‌మ పౌరుడినైనా.. చ‌ట్టం ముందు తాను కూడా సాధార‌ణ పౌరుడినేన‌ని సాక్షాత్తు మేయ‌ర్ కూడా త‌న త‌ప్పు ఒప్పేసుకోవ‌డంతో పాటు ఏకంగా త‌న‌పై విధించిన జ‌రిమానాను చెల్లించేందుకు కూడా సిద్ధ‌ప‌డిపోయారు. ఇదంతా ఎక్క‌డో చ‌ట్టాలు ప‌క్కాగా అమ‌లు అవుతున్నాయ‌ని చెప్పుకుంటున్న అగ్ర‌రాజ్యాల్లో చోటుచేసుకున్న ఘ‌ట‌న అనుకేంటే త‌ప్పులో కాలేసిన‌ట్టే. ఎందుకంటే... ఏకంగా మేయ‌ర్‌నే చ‌ట్టం ముందు చేతులు క‌ట్టుకునేలా చేసిన ఈ ఘ‌ట‌న మ‌న భాగ్య న‌గ‌రి హైద‌రాబాదులో చోటుచేసుకున్న‌దే. మేయ‌ర్ ఓ త‌ప్పు చేశారంటూ ఓ సాధార‌ణ పౌరుడు ఫిర్యాదు చేయ‌డ‌మే కాకుండా దానికి సంబంధించిన ప‌క్కా రుజువును కూడా అంద‌జేయ‌డంతో పోలీసులు కూడా మేయ‌ర్ ది త‌ప్పేనంటూ తేల్చేసి ఏకంగా జ‌రిమానా విధించేశారు.

త‌న‌పైనే జ‌రిమానా విధిస్తారా? అంటూ రంకెలు వేసే నేత‌లున్న ప్ర‌స్తుత కాలంలో... హైద‌రాబాదు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌.. అందుకు భిన్నంగా స్పందించి త‌న గొప్ప‌త‌నాన్ని చాటుకున్నారు. చ‌ట్టం ఏ ఒక్క‌రికి చుట్టం కాద‌ని, న‌గ‌రానికి మేయ‌ర్‌నే అయినా... చ‌ట్టం ముందు తాను కూడా సాధార‌ణ పౌరుడినేన‌ని, త‌న‌ది త‌ప్పేన‌ని నిజాయ‌తీగా ఒప్పేసుకున్నారు. ఏకంగా పోలీసులు విధించిన జ‌రామానాను కూడా క‌ట్టేస్తాన‌ని ఒప్పేసుకున్నారు. ఓ నాలుగు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే... హైద‌రాబాదు మేయ‌ర్ హోదాలో బొంతు రామ్మోహ‌న్... న‌గ‌ర‌మంతా ప‌ర్య‌టిస్తూ ఉంటారు. ఈ క్ర‌మంలో మొన్న మాదాపూర్ వెళ్లిన రామ్మోహ‌న్ కారు దిగేసి త‌న ప‌ని మీద వెళ్లిపోయారు. అయితే కారు డ్రైవ‌ర్ కారును మాత్రం నో పార్కింగ్ ఏరియాలో నిలిపేశాడు. మేయ‌ర్ కారు క‌దా.. ఆయ‌న కారును ఎక్క‌డ నిలిపినా... ఏమ‌వుతుందిలే అన్న భావ‌న‌తోనే కారును డ్రైవ‌ర్ అక్క‌డ నిలిపేసి ఉంటారు.

అయితే ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన ఓ వ్య‌క్తి.. నో పార్కింగ్ ఏరియాలో బొంతు వాహ‌నం నిలిపి ఉన్న వైనాన్ని ఫొటో తీసి.. నేరుగా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న ఫిర్యాదుతో పాటు తాను తీసిన ఫొటోను కూడా జ‌త చేశాడు. దీనిని ప‌రిశీలించిన పోలీసులు... ఆ ఫిర్యాదును ట్రాఫిక్ విభాగానికి బ‌దిలీ చేశారు. ఇంకేముంది మేయ‌ర్ వాహ‌నం నిజంగానే నో పార్కింగ్ ఏరియాలో ఉంద‌ని నిర్ధారించేసిన ట్రాఫిక్ పోలీసులు... ఆ వాహ‌నంపై ఫైన్ వేశారు. దానిని నేరుగా మేయ‌ర్‌కు అంద‌జేశారు. దీనిపై మేయ‌ర్ గ‌గ్గోలు పెడ‌తార‌ని, అందుకు త‌గిన స‌మాధానాన్ని కూడా వారు రెడీ చేసుకున్నారు. అయితే ఏ ఒక్క‌రూ ఊహించ‌ని విధంగా బొంతు చాలా హుందాగా వ్య‌వహ‌రించారు. తన కారు నో పార్కింగ్ ఏరియాలో పార్క్ అయిన విష‌యం వాస్త‌వ‌మే.. అయితే ఇది త‌న‌కు తెలియ‌కుండా జ‌రిగిపోయింద‌ని జ‌రిగిన త‌ప్పును ఒప్పేసుకున్నారు. అంతే కాకుండా... తెలిసి జ‌రిగినా, తెలియ‌కుండా జ‌రిగిన త‌ప్పు త‌ప్పేన‌ని మ‌రింత క్లారిటీ ఇచ్చేసిన రామ్మోహ‌న్... ట్రాఫిక్ పోలీసులు త‌న‌పై విధించిన ఫైన్ ను చెల్లిస్తాన‌ని కూడా తేల్చి పారేశారు. అంత‌టితో ఆగ‌ని బొంతు... ఈ ఘ‌ట‌న ప్ర‌జ‌ల్లో వ‌చ్చిన చైత‌న్యానికి నిద‌ర్శ‌న‌మ‌ని, ప్ర‌జ‌లంతా ఇలాగే అప్ర‌మ‌త్తంగానే కాకుండా బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రిస్తే... న‌గ‌రంలో ప‌రిస్థితుల‌ను మ‌రింత ఉన్న‌తంగా మార్చుకోవ‌చ్చ‌ని సూచించారు. ఈ ఘ‌ట‌న‌ను చూస్తుంటే.... మ‌న పాల‌కులంతా బొంతు మాదిరే మారిపోతే ఎంత బాగుంటుంది అనిపించ‌క మాన‌దు అన్న వాద‌న వినిపిస్తోంది.