Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం..కేసీఆర్ ఆఫర్ తిరస్కరించిన బొంతు రామ్మోహన్‌!

By:  Tupaki Desk   |   18 Feb 2021 1:09 PM GMT
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం..కేసీఆర్ ఆఫర్ తిరస్కరించిన బొంతు రామ్మోహన్‌!
X
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి మూడు ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థుల బరిలో దిగగా మహబూబ్‌నగర్ ,రంగారెడ్డి , హైదరాబాద్ స్థానం నుంచి ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాయి. కానీ టీఆర్ ఎస్ మాత్రం తమకు అచ్చిరాని ఈ స్థానానికి ఇంకా అభ్యర్థిని ఎంపిక చేయలేదు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన దేవి ప్రసాద్ ఓటమి చెందారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఎంపిక చేసి బీఫామ్ ఇచ్చిన కేసీఆర్.. మరో స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేయకపోవడం ఆసక్తికరంగా మారింది.

ఇక్కడి నుంచి టీఆర్ ఎస్ పోటీ చేయదని, బీజేపీని దెబ్బతీయడం కోసం ప్రజా సంఘాల మద్దతుతో బరిలో దిగుతున్న ప్రొఫెసర్ నాగేశ్వర్‌ కు పరోక్షంగా మద్దతు ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. దుబ్బాక, జీహెచ్ ఎం సీ ఫలితాలతో టీఆర్ ఎస్ కు నష్టం వాటిల్లింది. దీంతో ఈ స్థానంపై పోటీ చేసే విషయంలో గులాబీ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఇటీవలే జీహెచ్ ఎం సీ మేయర్‌ గా పదవీకాలం పూర్తి చేసుకున్న బొంతు రామ్మోహన్‌ రావు కు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారని, కానీ ఈ స్థానం నుంచి పోటీకి ఆయన సిద్ధం లేరనే ప్రచారం జరుగుతుంది.

టీఆర్ ఎస్ నుంచి పోటీ చేసేందుకు మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరుకు చెందిన వర్కటం జగన్నాథ్ ‌రెడ్డి ఆసక్తి కనబరుస్తున్నారట. 2011లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2018 ఎన్నికలకు మందు టీఆర్ ఎస్ లో చేరారు. ఆయన ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరి ఆయన్ను టీఆర్ ఎస్ ఆయన్ను పోటీకి దింపుతుందా లేదంటే వెనక్కి తగ్గుతుందా అనేది మరి కొద్ది రోజుల్లో తేలనుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీమంత్రి, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ చిన్నారెడ్డి పేరును ఖరారు చేసింది. ఆయన నామినేషన్‌ కూడా వేశారు.