Begin typing your search above and press return to search.

పాకిస్తాన్ జాతిపిత‌ పెళ్లికోసం అంత ప‌నిచేశాడట‌

By:  Tupaki Desk   |   19 April 2017 5:22 AM GMT
పాకిస్తాన్ జాతిపిత‌ పెళ్లికోసం అంత ప‌నిచేశాడట‌
X
పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మదాలీ జిన్నా పార్సీ యువతి రుట్టీ పెట్టీటిని వివాహం చేసుకున్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. పెళ్లయిన తర్వాత ఆమె ముస్లిం మతంలోకి మారి తన పేరును మరియం జిన్నాగా మార్చుకుంది. అయితే పెళ్లికి ముందు బుర్రమీసాల్లో కనిపించిన జిన్నా ఆమెతో పెళ్లి తర్వాత మీసాలు లేకుండానే గడపడానికి కారణమేమిటో మాత్రం ఎవరికీ తెలియదు. అయితే 42ఏళ్ల వయసులో జిన్నా రుట్టీతో పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు ఆమె అలాంటి షరతు పెడుతుందని ఆయన ఊహించే ఉండరు. జిన్నా పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు తనను పెళ్లి చేసుకోవాలంటే తన బుర్ర మీసాలను షేవ్ చేసుకోవాలని ఆమె షరతు పెట్టిందట. జిన్నా ఆమె షరతుకు అంగీకరించి మీసాలు తీసేసుకోవడమే కాకుండా ఆమెను ఇంప్రెస్ చేయడానికి తన జుత్తును కూడా కురచ చేసుకున్నాడట.

‘మిస్టర్ అండ్ మిసెస్ జిన్నా- ది మ్యారేజ్ దట్ షుక్ ఇండియా’ పేరిట తాను రాసిన తాజా పుస్తకంలో సీనియర్ జర్నలిస్టు షీలారెడ్డి జిన్నా జీవితంలోని ఇలాంటి వెలుగుచూడని ఎన్నో ఆసక్తికర సంఘటనలను పేర్కొన్నారు. ఈ పుస్తకంపై ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన షీలారెడ్డి జిన్నా-ఆయన భార్య, వారి కుటుంబాలకు సంబంధించిన అరుదైన ఫోటోలతో పాటు వారి జీవితాల్లోని పలు ఆసక్తికరమైన సంఘటనలను వివరించారు. ముస్లిం అయిన జిన్నా తనకన్నా వయసులో 24 ఏళ్ల చిన్న అయిన పార్సీ యువతితో పెళ్లి ప్రస్తావన తేవడమే అప్పట్లో ఓ పెద్ద సంచలనంగా మారింది. రుట్టీ పెటిట్ తండ్రి దిన్‌ షా మానెక్ జీ పెటిట్ వద్ద ఆయన కుమార్తెతో తన పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు జిన్నా ఒక బారిస్టర్‌ గా తన క్రాస్ ఎగ్జామినేషన్ నైపుణ్యాన్నంతా ప్రదర్శించారని షీలారెడ్డి చెప్పారు. ‘దిన్‌ షాతో మాట్లాడుతున్నప్పుడు జిన్నా ఆయనను మతాంతర వివాహాలపట్ల మీ అభిప్రాయమేమిటని యదాలాపంగా అడిగారు. దానికి సమాధానంగా దిన్‌ షా ‘ఇది దేశ సమైక్యతకు దోహదం చేసే ఓ గొప్ప విషయం అవుతుంది’ అని చెప్పారు. ఆ వెంటనే జిన్నా ‘నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అని చెప్పారు. వెంటనే జిన్నాను దిన్‌ షా గుమ్మం బైటికి గెంటేసారు, ఆ తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ ఎప్పుడూ కలుసుకోలేదు’ అని షీలారెడ్డి చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/