Begin typing your search above and press return to search.

సీఎం కుర్చీపై బెట్టింగ్‌ ల జోరు

By:  Tupaki Desk   |   21 Dec 2017 8:11 AM GMT
సీఎం కుర్చీపై బెట్టింగ్‌ ల జోరు
X
ఔను. గుజ‌రాతీల‌తో పాటు దేశంలోని ఇత‌ర రాష్ర్టాల ప్ర‌జ‌లు కూడా అవాక్క‌య్యేలా చేస్తున్న‌వార్త ఇది. హోరాహోరీగా సాగిన పోరులో ఫ‌లితాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై గుజ‌రాతీయులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. బంప‌ర్ మెజార్టీపై క‌న్నేసిన‌ప్ప‌టికీ...నామ‌మాత్ర‌పు మెజార్టీతో విజయం సాధించిన రాష్ట్రంలో కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది. బీజేపీ నూతన ప్రభుత్వం ఈనెల 25న కొలువుదీరే అవకాశమున్న నేప‌థ్యంలో నూత‌న సీఎం ఎవ‌ర‌నేది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అయితే అదే స‌మ‌యంలో బెట్టింగ్‌ ల జోరు అందుకుంది.

ముఖ్యమంత్రి విజయ్ రూపాని - ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్‌ ల నేతృత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నదని ప్రచారంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. అయితే, ఈ ఎన్నికలను మోడీ సారథ్యంలోనే ఎదుర్కొన్నారు. ‘ఈసారి తక్కువ మెజార్టీతో గెలిచినందున - ముఖ్యమంత్రిని మార్చాలని పార్టీ యోచిస్తోంది’ అని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే, మోడీ - పార్టీ సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు తుది నిర్ణయాన్ని తీసుకుంటారని వెల్లడించాయి. ఈ విషయమై సీఎం రూపాని స్పందిస్తూ..ఈ ఎన్నికల్లో పార్టీ తన నేతృత్వంలోనే పోరాడిందని - అయితే తుది నిర్ణయం మోడీ - పార్టీ సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు తీసుకుంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్త సర్కారు ఈనెల 25న ప్రమాణ స్వీకారం చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపారు.

మ‌రోవైపు సందట్లో సడేమియాలాగ పందెం రాయుళ్లు మాత్రం సీఎం అభ్యర్ధిపై జోరుగా బెట్టింగ్ కాస్తున్నారు. గుజరాత్‌ లో ముఖ్యమంత్రి ఎవరనేదానిపై సస్పెన్స్ కొనసాగుతున్న నేప‌థ్యంలో వీరు తెర‌మీద‌కు వ‌చ్చారు. గుజరాత్ సిఎం అభ్యర్ధి రేసులో ప్రధానంగా ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ రూపానీ - నితిన్ పటేల్ ఉన్నారు. అయితే సీఎం రేసులో విజయ్‌ రూపానీకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్‌ కు ముందు ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారంటూ బెట్టింగ్ కట్టిన బుకీలు తాజాగా సీఎం అభ్యర్ధిపై భారీగా బెట్టింగ్ కాస్తున్నారు. విజయ్‌ రూపానీ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నట్లు బెట్టింగ్ మార్కెట్ అంచనా వేస్తోంది. అటూ అమిత్‌షా కూడా సిఎం అవుతాడంటూ జోరుగా పందేలు కడుతున్నారు. ఆనందిబెన్ పటేల్ తర్వాత అందరూ నితిన్ పటేల్ ముఖ్యమంత్రి అవుతారంటే ఎవరూ ఊహించని విధంగా విజయ్ రూపానీ సీఎం అయ్యారు.

అలాగే యూపీలో కూడా ఎవరి అంచనాలకు అందకుండా యోగి ఆదిత్యనాథ్ సీఎం పీఠం ఎక్కారు.ఈ నేపథ్యంలో ఏదైనా జరగొచ్చన్న సందేహంతో అమిత్‌ షా మీద కూడా పందెం రాయుళ్లు బెట్టింగ్ కాస్తున్నారు. ఇంకొంద‌రు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ పేరును తెర‌మీద‌కు తీసుకువ‌చ్చారు. అయితే స్వ‌యంగా ఆమె క్లారిటీ ఇచ్చిన నేప‌థ్యంలో ఈ జాబితా మారిపోయింది.