Begin typing your search above and press return to search.

ఒక్కరోజులో ఆ బిల్లు కాస్తా చట్టమైంది

By:  Tupaki Desk   |   13 May 2016 6:47 AM GMT
ఒక్కరోజులో ఆ బిల్లు కాస్తా చట్టమైంది
X
చాలా అరుదుగా చోటు చేసుకునే పరిణామం. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదైనా చట్టం కావాలంటే దానికి ఉండే ప్రాసెస్ అంతా ఇంతా కాదు. లోక్ సభలో బిల్లు పెట్టాక అది సభలో అన్ని పక్షాలు ఓకే అని ఆమోదముద్ర వేసిన తర్వాత రాజ్యసభకు వెళుతుంది. అక్కడ మెజార్టీ సభ్యుల ఆమోదం పొందిన తర్వాత ఆ బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్లి.. ఆయన దానికి ఓకే అని ఆమోదముద్ర వేసిన తర్వాత కానీ చట్టంగా మారదు. ఇదంతా ఒక్కరోజులో జరగటం సాధ్యమే కాదు. కానీ.. ఏదీ అసాధ్యం కాదన్న విషయం మరోసారి రుజువైంది. పార్లమెంటులో అరుదైన ఘటన ఒకటి చోటు చేసుకుంది.

ఒక బిల్లు ఒకే రోజులో లోక్ సభ.. రాజ్యసభల్లో ఆమోదం పొందటమే కాదు.. రాష్ట్రపతి ఆమోదముద్ర పడిన అరుదైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. బీహార్ లోని రాజేంద్రప్రసాద్ సెంట్రల్ ఆగ్రికల్చర్ యూనివర్సిటీ బిల్లు విషయంలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వెనుకబడిన రాష్ట్రంగా ఉన్న బీహార్ కు చెందిన బిల్లు కావటంతో ఎక్కడా.. ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు.

దీంతో.. లోక్ సభలో ఈ బిల్లు ఆమోద ముద్ర పడటం.. రాజ్యసభలోకి వెళ్లిన వెంటనే దీనికి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకుండా ఆమోద ముద్ర వేసేశారు. ఆసక్తికరంగా రాష్ట్రపతి ఆమోదముద్ర పడటంతో ఒక్కరోజులో బిల్లు కాస్తా చట్టంగా మారిపోయింది. మన రాజకీయ నాయకులు అనుకోవాలే కానీ.. ఒక బిల్లును సూపర్ ఫాస్ట్ తో పాస్ చేయించగలరన్న మాట.