Begin typing your search above and press return to search.

బాబును భ‌లే ఇర‌కాటంలో ప‌డేసిన బొత్స‌, అంబటి

By:  Tupaki Desk   |   2 April 2017 4:27 PM GMT
బాబును భ‌లే ఇర‌కాటంలో ప‌డేసిన బొత్స‌, అంబటి
X
ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసే రీతిలో ఎమ్మెల్యేల‌చే పార్టీ పిరాయింప‌చేయ‌డ‌మే కాకుండా వారికి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో అవ‌కాశం క‌ల్పించిన ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తీరుపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ మండిప‌డింది. వైసీపీ ముఖ్య‌నేతలు బొత్స స‌త్యనారాయ‌ణ‌, అంబ‌టి రాంబాబు టీడీపీ అధినేత తీరుపై తీవ్రంగా స్పందించారు. వేర్వేరుగా మీడియాతో మాట్లాడిన ఈ నేత‌లు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏపీ కేబినెట్‌లో వైసీపీ ఎమ్మెల్యేలకు చోటు కల్పించడంపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. తమ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు.

తెలంగాణలో ఫిరాయింపులను వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, సీఎం చంద్రబాబు.. ఏపీలో ఎలా సమర్థించుకుంటారని బొత్స సూటిగా ప్ర‌శ్నించారు. గతంలో తలసానిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రివర్గంలోకి తీసుకున్నప్పుడు తప్పుబట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయారా అని నిలదీశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పదవులు ఇవ్వడం అనైతిక చర్య అంటూ గ‌తంలో గవర్నర్‌ను పదేపదే విమర్శించిన చంద్ర‌బాబు ఇప్పుడు చేసింది ఏమిట‌ని బొత్స నిల‌దీశారు. రాష్ట్రంలో అనైతిక పాలన సాగిస్తున్న చంద్ర‌బాబు తానే ప్ర‌జాస్వామ్య విలువ‌ల ప‌రిర‌క్ష‌కుడిగా ప్ర‌క‌టించుకోవ‌డం సిగ్గుచేట్ట‌న్నారు.

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమరావతి సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హత్య చేశారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిథి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. న‌లుగురు పార్టీ ఫిరాయింపుదార్లకు మంత్రిపదవులు కట్టబెట్టడంపై అంబటి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాల్సిన దౌర్భాగ్యమేమిటని ప్ర‌శ్నిస్తూ టీడీపీలో సమర్థులు లేరా అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మంత్రులు చేసిన ఘనత చంద్రబాబుదేనని, చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలు ప్రతి ఒక్కరూ ఖండించాలని అంబ‌టి కోరారు. తెలంగాణ‌లో తలసానికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడారని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబుకు ఆ మాటలు, ఆయన చెప్పిన విలువలు ఎందుకు గుర్తు రావడం లేదని మండిపడ్డారు. అప్రజాస్వామిక విధానానికి చంద్రబాబు తెరలేపినందుకు భవిష్యత్‌లో టీడీపీ, చంద్రబాబు, లోకేష్‌ మూల్యం చెల్లించక తప్పదని అంబటి హెచ్చరించారు.