Begin typing your search above and press return to search.

ఢిల్లీకి బొత్స...విజయనగరం పాలిటిక్స్ లో కొత్త గేమ్

By:  Tupaki Desk   |   13 Sep 2022 9:16 AM GMT
ఢిల్లీకి బొత్స...విజయనగరం పాలిటిక్స్ లో కొత్త గేమ్
X
బొత్స సత్యనారాయణ వైసీపీలో అత్యంత సీనియర్ మోస్ట్ నేత. ఆయన వైఎస్సార్ హయాంలో మంత్రిగా పనిచేశారు. జగన్ తో కూడా కలసి ఈ రోజున కూడా మంత్రి పదవి దర్జాను అనుభవిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలీ అంటే విజయనగరం అంటే బొత్స సత్యనారాయణ. తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన బొత్సకు ఉత్తరాంధ్రా నాయకుడిగా పట్టు ఉంది. 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీని ఒంటి చేత్తో గెలిపించారు. మొత్తానికి మొత్తం సీట్లు వైసీపీ పరం కావడానికి బొత్స కృషి చాలా ఉంది.

రాజకీయ వ్యూహకర్తగా, బలమైన బీసీ నేతగా బొత్స వైసీపీకి అసెట్ గానే చెబుతారు. అయితే వైసీపీని యువరక్తంతో నింపుదామని జగన్ ఆలోచిస్తున్నారు. ఈ నేపధ్యంలో సీనియర్లను ఢిల్లీ బాట పట్టిస్తారు అన్న వార్తలు అయితే బాగా ప్రచారంలో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయనగరం ఎంపీ సీటు నుంచి వైసీపీ తరఫున బొత్సను బరిలోకి దింపాలని జగన్ ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.

బొత్స అరవై ప్లస్ ఏజ్ లో ఉన్నారు. బాగా సీనియర్. ఆయన జగన్ కంటే రాజకీయంగా అనుభవం కలిగిన వారు. అలాంటి టీం ని తన మంత్రులుగా ఉంచుకుని వారికి గట్టిగా చెప్పే సీన్ కూడా జగన్ కి ఉండడంలేదు. జూనియర్లను తీసుకుంటే తన పని సులువు అవుతుంది అని జగన్ ఆలోచిస్తున్నారని టాక్. తండ్రి హయాంలో పనిచేసిన వారిని గత‌సారి టిక్కెట్లు ఇవ్వడానికి కారణం 2019 ఎన్నికలు చావో రేవో లాంటివి కావడమే అని అంటున్నారు.

ఈసారి అలాంటిది లేదు కాబట్టి తాను అనుకున్న మార్పులు చేయడానికి జగన్ గట్టిగానే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఆ విధంగా ఆలోచిస్తే బొత్సను విజయనగరం ఎంపీ సీటుకు వైసీపీ తరఫున పోటీ చేయిస్తే కచ్చితంగా ఆ సీటుని రెండవమారు గెలుచుకోగలమని జగన్ భావిస్తున్నారు. ఇక సిట్టింగ్ ఎంపీగా ఉన్న బెల్లాల చంద్రశేఖర్ ని తెచ్చి బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలనుకుంటున్నారుట.

ఈ విధంగా చేయడం వల్ల రెండు సీట్లూ వైసీపీ ఖాతాలో పడతాయన్నది జగన్ ప్లాన్ గా ఉంది అంటున్నారు. బెల్లాల చంద్రశేఖర్ ఆది నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయనే మొదట జగన్ తో పాటు వైసీపీలో చేరారు 2014 ఎన్నికల్లో ఓడిన తరువాతనే బొత్స వైసీపీలో ఎంట్రీ ఇచ్చారని అంటున్నారు. ఇక బెల్లాల విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా కాంగ్రెస్ టైం లో పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున చీపురుపల్లి నుంచి పోటీ చేశారు. ఆయన సొంత నియోజకవర్గం కూడా అదే కావడం విశేషం. పైగా ఆయన బొత్సకు బంధువు కూడా.

ఇలా అన్ని రకాలైన రాజకీయ, సామాజిక సమీకరణలను చూసుకుని ఈ కుండమార్పిడికి జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే బొత్స మేనల్లుడు చిన్న శ్రీనుకు విజయనగ‌రం జిలా వైసీపీ బాధ్యతలను పూర్తిగా అప్పగించాలని కూడా జగన్ ఆలోచిస్తున్నారు అని చెబుతున్నారు. జగన్ పాదయాత్ర వేళ చిన్న శ్రీను చేసిన ఏర్పాట్లు, ఆయన కమిట్మెంట్ నచ్చేసి నాడే టికెట్ ఇస్తానని జగన్ ఆయనకు చెప్పారు. కానీ 2019 ఎన్నికల్లో చిన్న శ్రీను పోటీ చేయలేదు. పార్టీ విజయం కోసం తన వంతుగా కృషి చేశారు. దానికి బదులుగా గత ఏడాది జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో చిన్న శ్రీనుకు జెడ్పీ చైర్మన్ గా జగన్ చాన్స్ ఇచ్చారు.

ఇక వచ్చే ఎన్నికల్లో ఏదో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిన్న శ్రీనుని పోటీ చేయించి తన మంత్రివర్గంలోకి తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి జిల్లా మీద బొత్స వారి పట్టు తప్పించి యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది జగన్ మార్క్ ఆలోచన అని చెబుతున్నారు. అయితే ఈ విషయం మీద బొత్స అంగీకరిస్తారా అన్నదే ఇపుడు చర్చ. తాను ఢిల్లీ రాజ్కీయాలకు దూరమని బొత్స గతంలోనే ప్రకటించారు. ఒకసారి ఆయన బొబ్బిలి నుంచి ఎంపెగా పోటీ చేసి గెలిచి కూడా ఎమ్మెల్యే అంటేనే తనకు ముద్దు అని చెప్పేశారు.

మరిపుడు ఆయన్ని మరోసారి ఢిల్లీ వెళ్ళమని కనుక జగన్ కోరితే బొత్స ఎంతవరకూ అంగీకరిస్తారు అన్నదే పెద్ద చర్చ. అయితే అక్కడ ఉన్నది జగన్. ఆయన ఆలోచనల మేరకే ఎవరైనా పనిచేయాల్సి ఉంటుంది. సీనియర్లు ఎంపీలుగా జూనియర్లు ఎమ్మెల్యేలుగా అని ఒక లెక్క పెట్టుకుని జగన్ కనుక అమలు చేస్తే బొత్స సైతం ఢిల్లీ బాట పట్టాల్సిందే అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.