Begin typing your search above and press return to search.

బొత్స మాట‌!..పోల‌వ‌రం కోసం హోదా తాక‌ట్టు!

By:  Tupaki Desk   |   21 Sep 2017 11:08 AM GMT
బొత్స మాట‌!..పోల‌వ‌రం కోసం హోదా తాక‌ట్టు!
X
న‌వ్యాంధ్ర‌కు జీవ‌నాధారంగా భావిస్తున్న జాతీయ ప్రాజెక్టు పోల‌వ‌రం నిర్మాణంపై చంద్ర‌బాబు స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై వైసీపీ కీల‌క నేత‌ - మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ నిప్పులు చెరిగారు. అస‌లు పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం జాప్యం కావ‌డానికి చంద్ర‌బాబు స‌ర్కారు తీరే కార‌ణ‌మ‌ని కూడా ఆయ‌న ఆరోపించారు. బాబు స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం ఓ జాతీయ కుంభ‌కోణంగా మారిపోయింద‌ని కూడా బొత్స త‌న‌దైన శైలిలో ధ్వ‌జ‌మెత్తారు. నేటి మ‌ధ్యాహ్నం హైద‌రాబాదులోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడిన బొత్స‌... బాబు స‌ర్కారు తీరును క‌డిగిపారేశార‌నే చెప్పాలి.

ఈ సంద‌ర్భంగా బొత్స ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... *పోలవరం ఓ జాతీయ కుంభకోణంగా మారిపోయింది. ప్రాజెక్టుపై చంద్ర‌బాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు తన ఆర్థిక అవసరాల కోసం, అవినీతి కార్యక్రమాల కోసం జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణాన్ని ఆలస్యం చేయడం ద్వారా ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టారు. పోలవరం నిర్మాణ బాధ్య‌త‌ల‌ను రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పిన చంద్రబాబు.. ప్రత్యేక హోదాను కేంద్రం వ‌ద్ద‌ తాకట్టు పెట్టారు. పోలవరం దోపిడీపై సీబీఐ విచారణ జరిపించాలి* అని బొత్స విరుచుకుప‌డ్డారు.

ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని చెప్పినా వినకుండా.. కంపెనీ ప్రతినిధులను బాబు వెనకేసుకొచ్చారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల తర్వాత ఆ కంపెనీ వల్లే పోలవరం ఆలస్యమైందని బాబు సాకులు చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో నోట్ల సంచులు మోసిన వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చింది వాస్తవం కాదా? అని చంద్రబాబును నిల‌దీశారు. వైఎస్‌ హయాంలో రూ.16వేల కోట్ల అంచనాతో పోలవరానికి శంకుస్థాపన చేసి రూ.4వేల కోట్లు ఖర్చు చేశారని ఆయ‌న‌ గుర్తు చేశారు. అప్పుడే 80శాతం వరకు కాలువలు కూడా పూర్తయ్యాయని బొత్స చెప్పారు. చంద్రబాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోలవరం అంచనాలను రూ.16వేల కోట్ల నుంచి 48వేల కోట్లకు పెంచారని బొత్స మండిపడ్డారు. పోలవరం అంచనాలు రూ.30 వేల కోట్లు ఎలా పెరిగాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజధనాన్ని వ్యయంగా చూపి దోచుకుంటున్నారని ఆరోపించారు. మూడున్నరేళ్లలో పోలవరంకు చేసిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని బొత్స‌ డిమాండ్ చేశారు.