Begin typing your search above and press return to search.

బొత్స బ‌స్తీమే స‌వాల్‌!... బాబు దొరికిపోయారు!

By:  Tupaki Desk   |   30 Jan 2019 4:59 PM GMT
బొత్స బ‌స్తీమే స‌వాల్‌!... బాబు దొరికిపోయారు!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం అలుపెర‌గని పోరు సాగిస్తున్నానంటూ క‌ల‌రింగ్ ఇస్తున్న టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు అడ్డంగా దొరికిపోయిన‌ట్టుగానే క‌నిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో నాలుగేళ్ల పాటు క‌లిసి సాగిన చంద్ర‌బాబు...ప్ర‌దాని న‌రేంద్ర మోదీ అపాయింట్ మెంట్ కోసం నానా క‌ష్టాలు ప‌డ్డ‌ట్టు చెప్పుకున్న సంగ‌తి తెలిసిందే క‌దా. ఈ క్ర‌మంలో ఢిల్లీకి ఏకంగా 29 సార్లు వెళ్లాన‌ని... అయినా ప్ర‌ధాని దుర‌హంకారంతో వ్య‌వ‌హ‌రించి త‌న‌కు అపాయింట్ మెంటే ఇవ్వ‌లేద‌ని పెడ బొబ్బ‌లు పెట్టిన విష‌యం కూడా తెలిసిందే క‌దా. అయినా ఓ సీఎం స్థాయిలోని నేత‌, అది కూడా ఎన్డీఏలో కీల‌క భాగ‌స్వామిగా చెప్పుకుంటున్న టీడీపీ అధినేత‌గా చంద్ర‌బాబుకు మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వ‌క‌పోవ‌డ‌మేమిట‌న్న ప్ర‌శ్న నాడే వినిపించింది. అయినా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం చ‌ర్చ‌లు జ‌రిపేందుకు వెళ్లే ఏ సీఎంకు అయినా పీఎం అపాయింట్ మెంట్ దొరక్కుండా ఉంటుందా? అన్న అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లు ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం డిమాండ్ చేసేందుకు కాదులే... ఏదో త‌న సొంత ప్ర‌యోజ‌నాల‌ను నెర‌వేర్చుకునేందుకేన‌న్న అనుమానాలు కూడా నాడు వినిపించాయి.

ఈ అనుమానాల‌న్నీ నిజ‌మేన‌ని ఇప్పుడు తేలిపోయింద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ ప‌చ్చి నిజాన్ని బ‌య‌ట‌కు తీసింది మ‌రెవ‌రో కాదు. వైసీపీ కీల‌క నేత‌ - మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఈ విష‌యాన్ని నిగ్గు తేల్చేందుకు ఏకంగా బ‌స్తీమే స‌వాల్ అంటూ చంద్ర‌బాబుకు ఓ భీక‌ర స‌వాల్ విసిరారు. ఈ స‌వాల్ కు చంద్ర‌బాబు స్పందించే విష‌యాన్ని పక్క‌న‌బెడితే... అస‌లు చంద్రబాబుకు బొత్స విసిరిన స‌వాల్ ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం 29 సార్లు ఢిల్లీకి వెళ్లాన‌ని చెప్పిన చంద్ర‌బాబు... ఓ మూడు సార్ల‌ను మిన‌హాయిస్తే... మిగిలిన 26 సార్లు మోదీకి అస‌లు లేఖ‌లు ఇచ్చారా? అని ప్ర‌శ్నించారు. ద‌మ్ముంటే త‌న స‌వాల్‌ కు స్పందించాల‌ని కూడా బొత్స కాస్తంత గ‌ట్టి స‌వాలే విసిరారు. ఢిల్లీ వెళ్లిన చంద్ర‌బాబు... ప్ర‌ధాని అపాయింట్‌ మెంట్ ఇవ్వ‌కుంటే అంత‌దూరం వెళ్లిన సీఎం క‌నీసం తాను ఎందుకోసం వ‌చ్చాన‌న్న విష‌యాన్ని అయినా పీఎంకు తెలియ‌జేసేందుకు ఓ లేఖ అయినా ఇచ్చి రావాల్సిందే క‌దా. ఒక్క చంద్ర‌బాబే కాకుండా ఏ ఒక్క‌రైనా ఈ దిశ‌గా ఢిల్లీకో - ఇంకెక్క‌డికో వెళ్లినా... త‌మ విజ్ఞాప‌న‌ను తెలుపుతూ తాను క‌ల‌వాల‌నుకుంటున్న నేత కార్యాల‌యంలో లేఖ అయితే ఇచ్చి రావాల్సిందే క‌దా.

మ‌రి మోదీ అపాయింట్ మెంట్ నిరాక‌రిస్తే... ఢిల్లీ దాకా స్పెష‌ల్ ఫ్లైట్ లో వెళ్లిన చంద్ర‌బాబు... తాను ఏపీకి ప్ర‌త్యేక హోదాపై చ‌ర్చించేందుకే వ‌చ్చాన‌ని ప్ర‌దాన‌మంత్రిత్వ కార్యాల‌యంలో లేఖ అయితే ఇచ్చి రావాలి క‌దా. మ‌రి చంద్ర‌బాబు లేఖ‌లు ఇచ్చారా? ఇచ్చి ఉంటే బొత్స స‌వాల్ కు స్పందించాల్సిందే క‌దా. బొత్స స‌వాల్ ను తిప్పి కొడుతూ... ఇదిగో తాను పీఎంఓలో ఇచ్చిన 26 లేఖ‌ల కాపీలు అంటూ చంద్ర‌బాబు వివ‌రాలు వెల్ల‌డించాల్సిందే క‌దా. మ‌రి ఆ దిశ‌గా చంద్ర‌బాబు స్పందిస్తారా? ఈ స‌వాల్ కు స్పందించాల‌ని అనుకుని ఉంటే... టీడీపీ నుంచి బొత్స‌కు ఇప్ప‌టికే కౌంట‌ర్ ప‌డిపోవాలి క‌దా. అలా కౌంట‌ర్ రాలేదంటే... బొత్స చేసిన ఆరోప‌ణ‌లు నిజ‌మే క‌దా. 29 సార్లు డిల్లీ వెళ్లాన‌ని చెబుతున్న చంద్ర‌బాబు... ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఏమాత్రం పోరాటం చేశారో ఈ ఉదంతం చెబుతుంది క‌దా. అంటే... బొత్స బ‌స్తీమే స‌వాల్ తో చంద్ర‌బాబు దొరికిపోయిన‌ట్టే క‌దా.