Begin typing your search above and press return to search.

అన్న క్యాంటీన్లు మూసివేయడంలేదు.. జగన్ ప్రభుత్వం క్లారిటీ

By:  Tupaki Desk   |   30 July 2019 1:44 PM GMT
అన్న క్యాంటీన్లు మూసివేయడంలేదు.. జగన్ ప్రభుత్వం క్లారిటీ
X
అన్న క్యాంటీన్ల విషయంలో కొన్ని రోజులుగా ముసురుకుంటున్న అనుమానాలపై వైసీపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ క్యాంటీన్లను మూసివేసే ఆలోచనేమీ తమకు లేదని.. వాటిని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అయితే.. షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా వాటి రంగు మార్చేయబోతున్నామని చెప్పింది.

అన్న క్యాంటీన్లపై జగన్ సర్కార్ అసెంబ్లీలో స్పష్టత ఇచ్చింది. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. క్యాంటీన్లను మూసివేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. పేదవాడి కడుపుకొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని.. అయితే, పేదవాడి ఆకలి తీర్చే కేంద్రాలకు కూడా టీడీపీ పార్టీ రంగు వేశారని ఆయన విమర్శించారు. చివరికి మార్చురీ పక్కన కూడా క్యాంటీన్ పెట్టారని విమర్శించారు. క్యాంటీన్ రంగు ఇప్పుడు తాము మారుస్తున్నామని.. అంతమాత్రాన వాటిని మూసివేస్తున్నట్లు కాదని బొత్స చెప్పారు.

రాష్ట్రంలో 183 అన్నా క్యాంటీన్లు మాత్రమే ఉన్నాయన్నారు. వీటిని ప్రక్షాళన చేసి అన్నార్తులకు ఉపయోగపడేలా చేస్తామని మంత్రి చెప్పారు. అంతకుముందు అన్న క్యాంటీన్ల పేరిట వందల కోట్ల అవినీతి జరిగిందని అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అన్న క్యాంటీన్లను టీడీపీ నేతలు ప్రచారానికి వాడుకున్నారని.. వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో అన్నపూర్ణ పథకం ప్రవేశ పెట్టారని.. అక్కడ ఈ పథకం కోసం కేవలం రూ.లక్షన్నర మాత్రమే ఖర్చు పెడితే.. ఇక్కడ మాత్రం అన్న క్యాంటీన్ల కోసం టీడీపీ ప్రభుత్వం ఒక్కొక్క క్యాంటీన్‌కు రూ.40-50 లక్షలు ఖర్చు చేసిందని ఆరోపించారు.

కొద్దిరోజులుగా కర్నూలు, అనంతపురం, ప్రకాశం.. ఇలా ఒక్కో జిల్లాలో క్యాంటీన్లు మూతపడుతుండడంతో ప్రభుత్వం వీటిని మూసివేసేందుకు సిద్ధమవుతోందని అంతా భావించారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులన్నీ ఇప్పడు రివ్యూ చేస్తుండడంతో వీటిని మూసివేయడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే, తాజాగా బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇవ్వడంతో హమ్మయ్య.. అన్న క్యాంటీన్లు సేఫ్ అనుకుంటున్నారు వాటిపై ఆధారపడేవారంతా.