Begin typing your search above and press return to search.

మహానటిని ఆ మాట అనటానికి మనసెలా ఒప్పింది బొత్స?

By:  Tupaki Desk   |   21 Dec 2022 4:12 AM GMT
మహానటిని ఆ మాట అనటానికి మనసెలా ఒప్పింది బొత్స?
X
రాజకీయాలు అన్న తర్వాత సవాలక్ష ఉంటాయి. కాదని అనలేం. అలా అని.. ఆ పేరుతో నోటికి వచ్చినట్లుగా మాట్లాడటంలో అర్థం లేదు. ఒకవేళ పొరపాటున నోరు జారి అనరాని మాట అన్న వేళ.. ఆ విషయాన్ని గుర్తించి.. బుద్ధిగా చెంపలేసుకొని తప్పు జరిగిందన్న మాటతో విషయం మొత్తం వెనక్కి వెళ్లిపోతుంది. కానీ.. అదేం ఖర్మమో కానీ రాజకీయ ప్రముఖులు ఎవరూ కూడా అలాంటి పనులు చేయటానికి పెద్దగా ఇష్టపడరు.

ఏపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అలియాస్ సత్తి బాబును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉత్తరాంధ్రకు సంబంధించిన బలమైన రాజకీయ నేతగా ఆయనకు పేరుంది. దివంగత మహానేత వైఎస్ హయాంలో మొదలైన ఆయన ప్రభ అంతకంతకూ పెరగటమే కానీ తగ్గింది లేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోవటం.. విభజన శాపం పుణ్యమా అని 2014లో భారీ ఎదురుదెబ్బ తగిలినప్పటికి తర్వాత కోలుకోవటం.. రికవరీ కావటం తెలిసిందే.

జగన్ సర్కారులో కీలక భూమిక పోషిస్తున్న ఆయన.. గతంలో మాదిరి హడావుడి చేయటం లేదు. అలా అని నోటికి పని చెప్పకుండా ఉండటం లేదు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి విమర్శలు చేసే క్రమంలో.. సినిమా రంగానికి చెందిన వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు వివాదంగా మారింది.

సినిమా వాళ్లను చూసేందుకు జనం ఎగబడతారని.. అలాంటప్పుడు పవన్ కల్యాణ్ ను చూసేందుకు జనం ఎందుకు రారు? అని వ్యాఖ్యానించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే బొత్స బాబాయ్ నోట్లో నాలుక తిరగబడింది.

పవన్ కల్యాణ్ మీద విమర్శలతో విరుచుకుపడే క్రమంలో ఎందుకు ప్రస్తావించారో కానీ మహానటి సావిత్రి గురించి ఆయన ఒక దారుణ వ్యాఖ్య చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు రావొచ్చు.. వెళ్లిపోవచ్చు కానీ.. తరాలు మారినా తరగని ప్రేమాభిమానాలు సొంతం చేసుకున్న ఏకైక నటి మహానటి సావిత్రి. ఆమె వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలతో కేవలం 46 ఏళ్ల వయసులో తనువు చాలించిన సంగతి తెలిసిందే.

అలాంటి మహానటి సావిత్రి ప్రస్తావన తీసుకొచ్చి.. ఆమె పేరు ముందు రాయలేని.. నోటితో ఉచ్చరించలేని ఒక పదాన్ని వాడేసిన బొత్స తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒకవేళ పొరపాటున అలా అని ఉంటారనుకుంటే.. ఆ విషయాన్ని ప్రస్తావించి.. క్షమాపణలు చెప్పటమో.. తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవటమో కానీ చేసి ఉంటే బాగుండేది. అదేమీ చేయకుండా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా.. అప్పుడెప్పుడో మరణించిన మహానటి గురించి అనుచిత వ్యాఖ్య చేయాల్సిన అవసరం ఉందంటారా బొత్స?




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.