Begin typing your search above and press return to search.

ప్రభుత్వాన్ని ప్ర‌శ్నించ‌కండి... ఉద్యోగులపై అదే కఠినత్వం

By:  Tupaki Desk   |   28 July 2022 11:59 AM GMT
ప్రభుత్వాన్ని ప్ర‌శ్నించ‌కండి... ఉద్యోగులపై అదే కఠినత్వం
X
ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌శ్నించ‌కండి.. విధాన ప‌ర నిర్ణ‌యాల‌ను వ్యతిరేకించ‌కండి..మీరు ఈ ప్ర‌భుత్వంలో భాగ‌స్వాములై ఉన్నారు క‌నుక అస్స‌లు మాట్లాడ‌కండి. ఒక‌వేళ మా నిర్ణ‌యాలు త‌ప్పయితే మేం వాటి ఫ‌లితాల‌ను భ‌రిస్తాం.

రేప‌టి వేళ ప్ర‌జాశీర్వాదం ఉంటుందా లేదా అన్న‌ది త‌రువాత అంటూ మంత్రుల క‌మిటీ తేల్చేసింది. నిన్న‌టి వేళ మంత్రుల కమిటీలో స‌భ్యులు అయిన బొత్స, స‌జ్జ‌ల తో భేటీ అయిన ఉద్యోగ సంఘాల‌కు ఓ విధంగా ప్ర‌భుత్వం స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఓ విధంగా మీరు మాట్లాడ‌వ‌ద్దు అని చెప్ప‌క‌నే చెప్పింది. రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా పాఠ‌శాల‌ల విలీనంపై ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం అవుతున్న సంద‌ర్భాన బొత్స ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ప్ర‌జా స్వామ్య స్ఫూర్తికే విరుద్ధం అని సంఘాల నాయ‌కులు ఎలా వాటిని విని మౌనంగా ఉంటారంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

వాస్త‌విక స్థితిగతులు అర్థం చేసుకోవాల‌ని కోరుతుంటే అది కూడా త‌ప్పేనా ! అంటే రేప‌టి వేళ ఏం జ‌రిగినా బ‌డుల‌కు పిల్ల‌లు రాకుండా ఉండిపోయినా, డ్రాపౌట్లు పెరిగిపోయినా ఏం జ‌రిగినా ప్ర‌భుత్వం నివేదిక‌లు మా నుంచి తెప్పించుకోదా ? అంటే అప్పుడు మాట్లాడేందుకు పోనీ అవ‌కాశం ఇస్తారా ఇవ‌న్నీ ఎందుకు ఎన్నిక‌ల వేళ పోనీ ఓట్ల‌డిగే వేళ అయినా మ‌మ్మ‌ల్ని మాట్లాడ‌నిస్తారా ? అంటూ ఉద్యోగులు ప‌లువురు ఫైర్ అవుతున్నారు.

ఇప్ప‌టికే సొంత పార్టీకి చెందిన 70మంది ఎమ్మెల్యేలు విలీనం వ‌ద్ద‌ని లేఖ‌లు రాశార‌ని, ఆ విష‌యం గుర్తు పెట్టుకోవాల‌ని కూడా కొంద‌రు సోష‌ల్ మీడియాలో ప్రభుత్వానికి హిత‌వు చెబుతున్నారు.

తాజా పరిణామాల నేప‌థ్యాన బొత్స వ్యాఖ్య‌ల‌పై దుమారం రేగుతోంది.వీలున్నంత వ‌ర‌కూ త‌ప్పులు దిద్దుకోవాల‌ని, త‌ప్పులుంటే చెబితే అదే త‌ప్పు అని ఎత్తి చూపుతూ దెప్పి పొడుపు మాటలు మాట్లాడ‌వ‌ద్ద‌ని ప్ర‌భుత్వ ప్ర‌తినిధులకు కొంద‌రు హితవు చెబుతున్నారు.

వీలున్నంత వ‌ర‌కూ పాఠ‌శాల‌ల త‌నిఖీలు చేప‌డితే ఉపాధ్యాయులంతా ఎన్ని గంట‌లు ప‌నిచేస్తున్నారు అన్న‌ది తేలిపోతుంద‌ని కూడా మ‌రో స‌ల‌హా మంత్రి బొత్స‌కు ఇస్తున్నారు. ఇవేవీ చేయ‌కుండా క్షేత్ర స్థాయిలో తిర‌గ‌కుండా మాట్లాడే మాట‌లు అర్థ ర‌హితం అని అంటున్నారు.