Begin typing your search above and press return to search.

పెళ్ళిళ్ళూ,,,విడాకులు అంటున్న మంత్రి...?

By:  Tupaki Desk   |   10 Jan 2022 4:46 PM GMT
పెళ్ళిళ్ళూ,,,విడాకులు అంటున్న మంత్రి...?
X
సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయ చతురోక్తులు బాగానే ఉంటాయి. ఉత్తరాంధ్రా మాండలీకాన్ని పట్టుబట్టి రాజకీయ ప్రత్యర్ధుల మీద ఆయన ఒడుపుగా ప్రయోగిస్తూంటారు. ఆయన సూటిగా కామెంట్స్ చేయరు కానీ అవి తగాలాల్సిన చోట బాగానే తగులుతాయి. ఆ దెబ్బకు ప్రత్యర్ధులు ఉక్కిరి బిక్కిరి అయి విలవిలలాడతారు. రాజకీయ ప్రత్యర్ధుల మీద బొత్సను మీడియా ఏదైనా విషయం మీద అడాగాలే కానీ ఆయన అసలు నో చెప్పరు. ఫుల్ ప్రిపేర్డ్ గా ఉంటూ ధాటీగానే జవాబు చెబుతారు. లేటెస్ట్ గా మీడియాతో బొత్స మాట్లాడుతూ రాజకీయ పెళ్ళిళ్ళూ విడాకులు అంటూ చాలా సరదా కామెంట్స్ చేశారు.

కుప్పంలో వన్ సైడ్ లవ్ ట్రాక్ అంటూ చంద్రబాబు జనసేనను చెప్పిన ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ట్విస్ట్ చేసి ఆయనకే పంచులేశారు బొత్స. టీడీపీ అధినేత చంద్రబాబు పొలిటికల్ లవ్ ట్రాక్ ఎపుడు మొదలవుతుందో, పెళ్ళి ఎపుడు ఎవరిని చేసుకుంటారో ఎవరికి విడాకులు ఎపుడు ఇచ్చుకుంటారో ఎవరికి తెలుసండీ అంటూ బొత్స బాగానే అంటించేశారు.

ఇక చంద్రబాబు పవన్ ల మధ్య గతంలో కూడా పొత్తు ఉందన్న దాన్ని గుర్తు చేసేలా వారెపుడు పెళ్లి అంటారో, ఎపుడు విడిపోతారో ఏంటో ఆ రాజకీయ పొత్తుల కధ అంటూ సెటైర్లు పేల్చారు. ఇలాంటివి చాలా చూశామన్నట్లుగా చంద్రబాబు వన్ సైడ్ లవ్ ట్రాక్ గాలి తీసేశారు.

అదే సమయంలో ఏపీ రాజకీయాల్లో చంద్రబాబుది చెదిరిన చరిత్ర అంటూ బొత్స చేసిన హాట్ కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు తనది ఫార్టీ ఇయర్స్ హిస్టరీ అని ఎపుడూ చెప్పుకుంటారు. అలాంటిది బొత్స ఆయన్ని చాలా ఈజీగా పక్కన పెట్టేసి రానున్న కాలంలో బాబుని ఎవరూ రాజకీయంగా పెద్దగా పట్టించుకోరు అన్నట్లుగా మాట్లాడం నిజంగా అతి పెద్ద విమర్శగానే చూడాలి.

అదే సమయంలో చంద్రబాబును చూసే జాలి వేస్తోంది అంటూ బొత్స ఇరిటేట్ చేసే ప్రయత్నం చేయడం కూడా గమనార్హం. కుప్పం వెళ్ళి తన తప్పులను చెప్పుకుని జనాల మెప్పు పొందుతారు అనుకుంటే ఏ మాత్రం ఆత్మ విమర్శ లేకుండా బాబు వ్యవహరించారు అని బొత్స కామెంట్స్ చేశారు. జగన్ని, వైసీపీని తిట్టడమే ఆయన పనిగా పెట్టుకున్నారు అంటూ బొత్స ఆరోపించారు.

మొత్తానికి రాజకీయ ప్రేమలు, పెళ్ళిళ్ళు, విడాకుల మీద బొత్స మాట్లాడిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. టీడీపీ జనసేనల మధ్య లవ్ ట్రాక్ ఉందో లేదో తెలియదు కానీ బొత్స లాంటి సీనియర్లు మాత్రం ఆదిలోనే గాలి తీసేలా పంచులు పేల్చడం ద్వారా మరింతగా రాజకీయ వేడిని రగిలిస్తున్నారు అనుకోవాలి.