Begin typing your search above and press return to search.

గవర్నర్ పై ఇంత కోపం ఉందా?

By:  Tupaki Desk   |   22 Jun 2015 7:46 AM GMT
గవర్నర్ పై ఇంత కోపం ఉందా?
X

తెలుగు రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఓటుకు నోటు కేసు డైలీ సీరియల్ లాగా సాగుతున్న క్రమంలో గవర్నర్ పాత్ర కీలకంగా మారింది. ఇరు రాష్ర్టాల మధ్య పరిస్థితిని సమన్వయం చేయడం, వాస్తవ పరిస్థితిని కేంద్ర పెద్దలకు నివేదించడం గవర్నర్ ముఖ్య విధి. అయితే ఆ క్రమంలో ఆయన సదరు పనులు సరిగా నిర్వర్తించడంలేదని ఇప్పటికే టీడీపీ గుస్సా అవడంతో పాటు కేంద్ర వద్ద కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా మరో ప్రధాన పార్టీ కూడా గవర్నర్ వ్యవహర శైలిపై తన వైఖరిని బయటపెట్టింది. ఉమ్మడి రాష్ర్టాల మధ్య ఉన్న వ్యక్తిగా మరింత క్రియాశీలంగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇటీవలే కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ మేరకు పార్టీ తరఫున తన వ్యాఖ్యలను తేటతెల్లం చేశారు. పరోక్షంగా తప్పుపట్టారు.

గవర్నర్‌ తెలంగాణ పక్షపాతి అనే విషయం మీద రాజ్యాంగ పరంగా కామెంట్‌ చేయడానికి వీలులేదన్నారు. ఏ సమస్య వచ్చినా పైకి.. లేదంటే కిందకు తోసేస్తూ నాకెందుకులే అని గవర్నర్ అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌కు వచ్చే వాహనాలకు పన్ను వేయడం, సెక్షన్‌ 8 చెల్లదని కేసీఆర్ చెప్పడంపై గవర్నర్ స్పందిస్తే బావుండేదని బొత్స స్పష్టం చేశారు.

రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు తన పరిధిలో ఉన్న అంశాలపై అవునో..కాదో గవర్నర్ తేల్చేయాలని చెప్పారు. కానీ నరసింహన్ అలా చేయట్లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సెక్షన్‌8పై గొడవ విషయమే ఇందుకు ఉదాహరణ అన్నారు. రెండు రాష్ట్రాల వాళ్లు వెళ్లి గవర్నర్ వద్ద ఎవరి వాదన వారు వినిపించారని గుర్తుచేశారు. ఆ క్రమంలో పరిశీలిస్తున్నాం.. అవసరమైన సమయంలో నిర్ణయాన్ని ప్రకటిస్తాం అనైనా చెప్పాలి కదా! అంటూ గవర్నర్ వైఖరిపై అసంతృప్తి వెళ్లగక్కారు.