Begin typing your search above and press return to search.

బొత్స మాట : రాజకీయాలంటే విరక్తి...మరి జనాల సంగతి...?

By:  Tupaki Desk   |   27 Jan 2023 6:00 AM GMT
బొత్స మాట : రాజకీయాలంటే విరక్తి...మరి జనాల సంగతి...?
X
రాజకీయాలు చూస్తూంటే విరక్తి కలుగుతోందని సీనియర్ వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. ఆయన నిజంగా తెగ వాపోతున్నారు. ఏ కాలం వ్యక్తిని ఈ కాలం లోకి వచ్చి ఈ తరహా రాజకీయాలు చూస్తున్నాను అని ఆయన కలత పడుతున్నారు. నిజమే బొత్సది నాలుగు దశాబ్దాల రాజకీయం. ఆయన టైం లో ఒక పద్ధతిలో రాజకీయాలు నడిచేవి.

ఒక విమర్శ అయినా అందంగా అర్ధవంతంగా ఉండేది. కానీ రాజకీయం ఇలా నేలబారుడు కావడానికి ఎవరు కారకులు అంటే బొత్స సార్ ఏమి చెబుతారు. ఆయన మంచి కాలంలో రాజకీయాల్లోకి వచ్చి ఉండవచ్చు. కానీ తరువాత అది కాస్తా అలా మారి దిగజారి ఈ స్థితికి వచ్చింది. దానికి అంతా బాధ్యులే. నిజం చెప్పాలంటే వర్తమాన రాజకీయాలు అంటే జనాలకే వెగటుగా ఉంది అంటే తప్పు లేదేమో.

ఇంతకీ బొత్సకు ఇంతటి వైరాగ్యం విరక్తి కలగడానికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహార శైలి అని అంటున్నారు. ఒక విధానం ఒక ఫిలాసఫీ లేకుండా పవన్ రాజకీయాలు చేస్తున్నారు అని మండిపడుతున్నారు బొత్స. ఆయన ఎగిరెగిగి పడుతున్నారని, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఆవేదన చెందుతున్నారు.

నిజమే ఈ మధ్య పవన్ భాష చాలా మారింది. ఆయన మంగళగిరిలో చెప్పు చూపించి దారుణమైన భాష వాడితే చంద్రబాబు వెంటనే వచ్చి పరామర్శించారు, అతి కొద్ది రోజుల వ్యవధిలోనే ప్రధాని మోడీ కూడా విశాఖ వచ్చి ఏకాంత భేటీకి ఆహ్వానించారు. ఆయన భాష తప్పు అని ఎవరూ అనలేదు. పైగా ఆయన వైసీపీకి గట్టి రిటార్టు ఇచ్చారని కూడా అన్న వారు ఉన్నారు.

దీని అర్ధమేంటి, బొత్సకు తెలియనిది కాదు కదా. ముందు తమ పార్టీకి చెందిన నాటి మంత్రులు కీలక నేతలు వాడిన భాష వల్లనే కదా పవన్ కూడా తన తీరు మార్చుకున్నారు అన్నది ఒక ఘాటు విమర్శ. మరి నాడు తమ పార్టీ వారు మాట్లాడిన భాషకు బొత్సకు అభ్యంతరం లేకుండా పోయింది. ఆయన సీనియర్ మంత్రిగా ఉంటూ అంతా వింటూ ఊరుకున్నారు. మరి అవతల వారు అంటే ఇవతల వారు కూడా ఊరుకుంటారా.

అందువల్ల పవన్ కూడా అదే భాష వాడుకున్నారు. దాంతో ఎవరిని మీరు బెదిరిస్తున్నారు ఎవరి మీద మండిపడుతున్నారు అంటూ బొత్స పవన్ మీద కామెంట్స్ చేయాల్సి వస్తోంది. మరి నాడు వైసీపీ నేతలు కూడా ఎవరిని బెదిరించడానికి అనుచిత భాష వాడారో కదా. ఇక పవన్ కళ్యాణ్ ఆవేశంతో తాట తీస్తా తోలు తీస్తా అన్న భాష వాడుతూ వచ్చారు. మొదట్లో ఇదేమిటి అని అనుకున్న వారు కూడా తరువాత ఆయన ఊతపదాలు అవి అని పెద్దగా పట్టించుకోలేదు.

అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం పవన్ సహా అంతా పట్టుకున్నారు. అదే వర్తమాన రాజకీయం చేసుకున్న దౌర్భాగ్యం గా చూడాలి. ఎపుడూ కూల్ గా మాట్లాడే చంద్రబాబు లాంటి వారు కూడా కొన్ని సంచలన కామెంట్స్ చేయాల్సి వస్తోంది అంటే రాజకీయం ఎటు పోతోంది అన్నది చూడాలి. మీడియా ఫోకస్ అటెన్షన్ అంతా వీటి మీదనే అని రాజకీయ నేతలు రూట్ మార్చారా లేక ఇలా మాట్లాడితే ఫైర్ బ్రాండ్ అనుకుంటారు అని అలవాటు చేసుకున్నారా ఏమో తెలియదు కానీ ఇపుడు అందరూ అలాగే ఉన్నారు.

ప్రత్యేకించి పవన్ని అనుకోవాల్సింది లేదు ఆ విషయంలో బొత్స వారు చింతించాల్సినదీ లేదు. పవన్ని చూసి రాజకీయాల మీద విరక్తి కలుగుతోందంటున్న బొత్స తమ పార్టీ సహా వర్తమాన రాజకీయాలను చూసి నొచ్చుకుంటే అర్ధం ఉంటుంది ఇక మరోమాట రాజకీయాలు బాగుండాలీ అంటే అంతా కలసి కూర్చుని ఒక ఏకాభిప్రాయానికి రావాలి. తాము అనుచితమైన పదాలు వాడమని ఒట్టేసుకోవాలి.

దానికి సీనియర్ నేతగా ఉన్న బొత్స లాంటి వారు కంకణం కట్టుకుంటే ఆయనతో పాటు జనాలకూ ఈ రాజకీయ విరక్తి బాధ తప్పుతుంది. కానీ అది అయ్యే పనేనా అంటూ కూర్చుంటే మాత్రం ఏదో నాటికి జనాలు సైతం బాబోయ్ రాజకీయం అనేస్తారు. అపుడు పార్టీలు నేతలు ఎంతలా గింజుకున్నా లాభం లేదంతే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.