Begin typing your search above and press return to search.

అవిశ్వాసంతోనే టీడీపీ చిత్త‌శుద్ధి అర్థ‌మైపోయింది

By:  Tupaki Desk   |   21 July 2018 4:14 PM GMT
అవిశ్వాసంతోనే టీడీపీ చిత్త‌శుద్ధి అర్థ‌మైపోయింది
X
అవిశ్వాసం పేరుతో టీడీపీ ఏం సాధించిందో తెలియ‌దు కానీ తెలుగుదేశం పార్టీ సెల్ఫ్‌ గోల్ చేసుకున్న‌ట్ల‌యింద‌ని జాతీయ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఆయా రాజకీయ పార్టీలు త‌మ అభిప్రాయ‌ల‌ను వ్య‌క్తం చేస్తుండ‌గా... తాజాగా ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ సైతం చంద్ర‌బాబు తీరును త‌ప్పుప‌ట్టాయి. వైఎస్ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు - ఎమ్మెల్యే ఆర్కే రోజా - పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ అవిశ్వాసం పేరుతో సాధించింది ఏంట‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి - ప్రత్యేక హోదా గురించి తొలి నుంచి పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ వైసీపీ అని చెప్పారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అద్భుతంగా మాట్లాడార‌ని ఆ పార్టీ నేత‌లు పేర్కొంటున్నార‌ని అయితే ఆయ‌న చేసిన డ్రామా... ఏపీ ప్రయోజనాల గురించి వారు ఎంత తక్కువగా ఆలోచిస్తున్నారో స‌బ‌లో సాగిన ప్ర‌సంగ‌మే కళ్లకు కట్టినట్టు చూపించింద‌ని రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్రం గురించి టీడీపీ నేతలు చేస్తున్న పోరాటంలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయం తేలిపోయిందని చెప్పారు. టీడీపీ డ్రామాలను ప్రజలంతా గమనించారని... 2019లో ఆ పార్టీ గల్లంతవడం ఖాయమని చెప్పారు.

చంద్రబాబు వంచన రాజకీయాల గుట్టు పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని మోడీ బట్టబయలు చేశారని వైఎస్ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు కోణంలో రాష్ట్రం అభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని - హోదా వద్దు ప్యాకేజీ ఇవ్వాలని కోరారని మోడీ పార్లమెంట్‌ సాక్షిగా చెప్పారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేస్తే దానికి ఆజ్యం పోసింది చంద్రబాబేనని మోడీ ప్రసంగం విన్న ప్రతి పౌరుడు ఆగ్రహంతో ఉన్నారన్నారు. లోక్‌ సభ నుంచి మంచి వార్త వినాలని ఎదురుచూసిన రాష్ట్ర ప్రజానీకానికి మరోసారి వంచన ఎదురైందన్నారు. రాష్ట్రాన్ని అడ్డంగా మోసం చేసిన కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలకు ఆంధ్రరాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. బీజేపీ - టీడీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు.