Begin typing your search above and press return to search.

పవన్‌ వల్ల గంటన్నర ట్రాఫిక్‌లో ఉండిపోయా: కీలక మంత్రి హాట్‌ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   20 Oct 2022 5:47 AM GMT
పవన్‌ వల్ల గంటన్నర ట్రాఫిక్‌లో ఉండిపోయా: కీలక మంత్రి హాట్‌ కామెంట్స్‌!
X
వైసీపీ నేతలపై జనసేనాని పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పవన్‌ విశాఖపట్నం వచ్చిన రోజు ర్యాలీ నిర్వహించడంతో గంటన్నరపాటు తాను ట్రాఫిక్‌లోనే ఇరుక్కుపోయానన్నారు.

రాజకీయాలన్న తర్వాత విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని చెప్పారు. విమర్శలు తట్టుకోలేక తిట్టడం సరికాదన్నారు. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.

పవన్‌ కల్యాణ్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. జనసేన పార్టీకి ఒక విధానం లేదని విమర్శించారు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే వ్యవస్థలు సహించవని తెలిపారు. అందరూ చెప్పులు చూపిస్తే పవన్‌ ఏమవుతారని ప్రశ్నించారు. టీడీపీతో టై అప్‌ అయ్యారు కాబట్టే పవన్‌ను ప్యాకేజీ స్టార్‌ అంటున్నారని గుర్తు చేశారు. తాను ప్యాకేజ్‌ స్టార్‌ కాదని పవన్‌ నిరూపించుకోవాలన్నారు.

పవన్‌ చంద్రబాబు దత్తపుత్రుడని వైఎస్సార్‌సీపీ మొదట్నుంచి చెబుతూనే ఉందన్నారు. మేం చెప్పింది నిజమేనని చంద్రబాబు–పవన్‌ తాజా భేటీతో నిరూపితమైందన్నారు. టీడీపీకి జనసేన పార్టీ బి టీమ్‌ అని మండిపడ్డారు. జనసేన రాజకీయ పార్టీ కాదు.. సెలిబ్రిటీ సంస్థ అని ధ్వజమెత్తారు. పవన్‌ లాంటి వాళ్ళ వల్లే రాజకీయ నాయకులు పలచనైపోతున్నారని నిప్పులు చెరిగారు. పవన్‌ అన్నయ్య చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఎంత గౌరవంగా ఉన్నారో అలా ఉండాలని పవన్‌ను కోరారు.

మంత్రులపై దాడి చేస్తే చర్యలు తీసుకోవద్దా? తీసుకోకపోతే ఎలా? అని నిలదీశారు. విశాఖపట్నంలో ఊరేగింపు వద్దని.. సభ నిర్వహించుకోవాలని పోలీసులు పవన్‌కు సూచించారని చెప్పారు. విశాఖపట్నంలో పవన్‌ సభ రద్దు చేసుకుంటే మా తప్పవుతుందా? అని ప్రశ్నించారు. ర్యాలీకి ముందుగా అనుమతి తీసుకుని ఉంటే పోలీసులే వేరే రూట్‌మ్యాప్‌ ఇచ్చేవారని చెప్పారు.

రాజమండ్రిలో రైతుల పాదయాత్రలో జరిగిన కొట్లాటపై తాను ఇరువురినీ తప్పుపడతానని బొత్స సత్యనారాయణ చెప్పారు. తమ వైసీపీ ఎంపీ మార్గాని భరత్, అలాగే అమరావతి రైతులు ఇలా ఇద్దరి తప్పు ఉందన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.