Begin typing your search above and press return to search.

అయ్యో బొత్సన్నా...సలహాదారు పాటి చేయకపోయేనా...?

By:  Tupaki Desk   |   26 Aug 2022 1:30 PM GMT
అయ్యో బొత్సన్నా...సలహాదారు పాటి చేయకపోయేనా...?
X
ఆయన సీనియర్ మోస్ట్ మంత్రి గారు. ఆయనే బొత్స సత్యనారాయణ. నిజం చెప్పాలీ అంటే ఉమ్మడి కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ గా పని చేసిన పెద్దాయన. తృటిలో ముఖ్యమంత్రి పదవి తప్పిపోయింది కానీ లేకపోతే ఆ ముచ్చట కూడా తీర్చుకుని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాదిరిగా ఎంచక్కా ప్రశాంత జీవితం గడిపేవారు. అయితే రాజకీయ ఆరాటంతో పాటు తనకు పట్టున్న చోట పలుకుబడి ఉన్న చోట గట్టిగా నిలబడాలని రాజకీయం కొనసాగించారు. 2014 ఎన్నికల తరువాత ఏపీలో వైసీపీని ఆయన ఎంచుకున్నారు.

ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు ఆయన తన వంతు కృషి చేశారు. ప్రత్యేకించి విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడానికి బొత్స చాలానే చేశారు. అలాంటి బొత్సకు జగన్ సర్కార్ లో మంత్రి పదవి అయితే అయిదేళ్ళకు సరిపడా కొనసాగింపు ఉంది కానీ విలువ గౌరవం ఒక సీనియర్ గా లభిస్తున్నాయా అంటే లేదు అన్న మాటే వస్తోంది.

తాజాగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఉద్యమ కార్యాచరణ డిసైడ్ చేయడమే కాదు, సెప్టెంబర్ 1న సీఎం జగన్ ఇల్లు ముట్టడిస్తామని పిలుపు ఇచ్చిన నేపధ్యంలో ప్రభుత్వం చర్చలు జరపడం కోసం సీనియర్ మంత్రిగా బొత్సకు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికి ఒకటి రెండు సిట్టింగులు ఆయనతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు జరిపారు కూడా. అయితే చిత్రంగా ఈ చర్చల మీటింగుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి వచ్చేశారు. ఆయన్ని ఎందుకు దింపారో కానీ బొత్స ఒకటి మాట్లాడుతూంటే ఆయన మరోటి మాట్లాడుతున్నారుట.

దాంతో చర్చలు కధ ఒకలా ఉంటే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కూడా బొత్స మాట వినడంలేదుట. మీరు ఒకలా చెబుతున్నారు. ఆయన మరోలా చెబుతున్నారు. మధ్యన మాకు ఇదేమిటి అంటున్నారు. ఇక బొత్స ఉద్యమ‌ నేతలకు ఫోన్లు చేసి సీఎం ఇల్లు ముట్టడిని వాయిదా వేసుకోవాలని కోరుతూంటే మీ మాట ఫైనల్ కాదు అస్లౌ సూత్రధారి ఆయనే అన్నట్లుగా మాట్లాడుతూండంతో బొత్స హర్ట్ అవుతున్నారుట.

అంటే ఈ సమస్యకు పరిష్కారం చూపేది సజ్జల తప్ప బొత్స కాదని ఉద్యమ సంఘాల నేతలే అనుకొవడం తో బొత్స పరిస్థితి చిత్రంగా మారింది అంటున్నారు. ఉమ్మడి ఏపీలో సీనియర్ మంత్రిగా బొత్స చక్రం తిప్పారు. ఇలాంటివి ఎన్నో చూశారు. అలాంటి బొత్స ఇపుడు ఇలా ఒక సలహాదారు ముందు తాను తక్కువగా కావడం తో మధనపడుతున్నారని అంటున్నారు. ఇక ఈ విషయం కాస్తా ప్రభుత్వ వ్యతిరేక మీడియాలో కూడా పెద్దగా రావడంతో ఇంతకంటే అవమానం ఉంటుందా అని ఆయన తన అనుచరులతో ఆవేదన చెందుతున్నారు అని అంటున్నారు.

ఇంతటి అనుభవం కలిగి ఎన్నో సమస్యలను పరిష్కరించిన బొత్స కంటే సలహాదారునకు ఏమి అనుభవం ఉంటుందని కూడా అంటున్న వారు ఉన్నారు. ఇక సజ్జల సార్ జనాలకు ఎప్పటి నుంచి తెలుసు అన్నది కూడా ప్రశ్నిస్తున్నారు. బొత్సది సుదీర్ఘ రాజకీయమని కూడా గుర్తు చేస్తున్నారు. అయితే పై వారే కోరి సజ్జలను రంగంలోకి దింపారని ఆయన్ని అలా సైడ్ చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి మంత్రిగా అయితే బొత్స ఉన్నారు కానీ ఆయనకు సరైన విలువ దక్కడం లేదు అంటే ఇదేనేమో అంటున్నారు.