Begin typing your search above and press return to search.

ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌నే బాబు డబ్బాను తేల్చేసింద‌ట‌

By:  Tupaki Desk   |   23 Oct 2016 7:00 AM GMT
ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌నే బాబు డబ్బాను తేల్చేసింద‌ట‌
X
రెయిన్‌ గన్ల ద్వారా అనంతపురం జిల్లాలో కరవును పారద్రోలామని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు ప్ర‌క‌టించడాన్ని వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. త‌మ రెయిన్ గ‌న్ల‌తో సీమ‌ను స‌స్య‌శ్యామలం చేశామ‌ని చంద్రబాబు ప్రగల్భాలు పలికినప్ప‌టికీ వాస్త‌వ ప‌రిస్థితి వేరేగా ఉంద‌న్నారు. ఒక‌ప‌క్క అనంత‌పురంలో అంత ప‌చ్చ‌ద‌నమే అని చెప్తున్న ప్ర‌భుత్వం అనంతపురంలోని అన్ని మండలాలనూ కరవు ప్రాంతాలుగా ప్రకటించడాన్ని చూస్తే ఏ మేరకు కరవును జయించారో అర్థమవుతుందని బొత్స ఎద్దేవాచేశారు. ఇప్పటికైనా ప్ర‌క‌ట‌న‌ల‌తో డ‌బ్బా కొట్టుకోవ‌డం మానేసి కళ్లుతెరిచి కరవు ప్రాంతాలుగా ప్రకటించిన మండల రైతులకు పరిహారం చెల్లించాలని బొత్స డిమాండ్ చేశారు.

గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో బొత్స మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగమంతా అనంతపురానికి వెళ్లి నాలుగు రోజుల్లో రెయిన్‌ గన్‌ ల ద్వారా లక్షలాది ఎకరాల్లో కరవును పారదోలామని ఇబ్బడి ముబ్బడిగా ప్రెస్‌ మీట్‌ లు పెట్టిమరీ ఊదరగొట్టారని దుయ్యబట్టారు. కానీ అక్క‌డి రైతుల ప‌రిస్థితి దారుణంగా ఉన్న నేప‌థ్యంలో అదే పాల‌కులు క‌రువు ప్ర‌క‌టించారంటే అర్థం చేసుకోవ‌చ్చున‌ని వ్యాఖ్యానించారు. వ్యవసాయశాఖ మంత్రి సొంత జిల్లాలో నకిలీ విత్తనాలు రాజ్యమేలుతుంటే కళ్లుండి కబోదిలా వ్యవహరించారే తప్ప వాటిని నియంత్రించ లేకపోయారని విమర్శించారు. ఆనాడు మిర్చి విత్తనాలు కేజీ లక్ష రూపాయల చొప్పున రైతులు కొనుగోలు చేస్తున్నా బ్లాక్ మార్కెట్‌ను అడ్డుకోలేక చేతులెత్తేయడంతో ఇప్పుడు రైతులు అన్నివిధాలా ఆర్థికంగా నష్టపోయారని బొత్స ఆవేద‌న వ్య‌క్తం చేశారు. క్యాబినెట్ మీటింగ్‌ లో స్వయాన సీఎం చంద్రబాబు నకిలీ విత్తన కంపెనీలపై పిడి యాక్ట్ నమోదు చేస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని, రైతులను ఆదుకుంటామని ప్రగల్భాలు పలికారని - ఎంతమందిపై చట్టాన్ని ప్రయోగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. భారీవర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడంలోనూ ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తోందని బొత్స‌ ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లాలో నష్టపోయిన ప్రతి 10 మంది రైతుల్లో ఇద్దరికి మాత్రమే సాయం అందిందని - ఆ ఇద్దరూ పచ్చచొక్కా వారేనని దుయ్యబట్టారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/