Begin typing your search above and press return to search.

చంద్రబాబు రాష్ట్రానికి టెండర్ పెట్టశారు: బొత్స

By:  Tupaki Desk   |   5 Jan 2020 4:21 AM GMT
చంద్రబాబు రాష్ట్రానికి టెండర్ పెట్టశారు: బొత్స
X
ఏపీ రాజధాని మార్పుల వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా మాజీ సీఎం - టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అమరావతి రాజధానిగా పనికిరాదని గత కమిటీలూ నివేదించాయని.. అయినా, చంద్రబాబు అదేమీ వినకుండా అక్కడే రాజధాని తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని నిర్మించడం సాధ్యం కాదని గతంలో శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చినా చంద్రబాబు దాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. ఏ ప్రాజెక్టు అయినా,టెండర్ అయినా.. తనకేం లాభం అని ఆలోచించడం చంద్రబాబుకు అలవాటని బొత్స విమర్శించారు. టెండర్ల పేరుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు.

చంద్రబాబు పాలనలో టెండర్ పెట్టినందుకే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రీటెండర్ల ప్రక్రియ చేపట్టామన్నారు. రాజధానిపై రాద్దాంతం చేయడం తగదని,ఒకసారి శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను చంద్రబాబు పూర్తిగా చదవాలని సూచించారు. గతంలో చంద్రబాబు చేసిన తప్పులను తమ ప్రభుత్వం సరిదిద్దుతోందన్నారు. అమరావతిలో భవనాలు నిర్మించాలంటే కనీసం 130 అడుగుల పునాది తీయాలని శివరామకృష్ణన్ కమిటీ పేర్కొందన్నారు. అమరావతి ఏడాదికి నాలుగు పంటలు పండే స్థలం అని, అక్కడ రాజధాని నిర్మాణం సాధ్యం కాదని నివేదికలో చెప్పారన్నారు. చంద్రబాబు ఉద్యోగులను ప్రభుత్వం పైకి ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. పరిపాలన వికేంద్రీకరణ జరగాలని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని గుర్తుచేశారు.

అమరావతిపై చంద్రబాబు చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలేనని మంత్రి బొత్స అన్నారు. అమరావతికి ఇంకో రూ.3వేల కోట్లు చాలునని - వాటితో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించవచ్చునని చంద్రబాబు చెబుతున్నారన్నారు. అలాంటప్పుడు అదే చంద్రబాబు రూ.52వేల కోట్ల పనులకు టెండర్లు ఎందుకు పిలిచారని ప్రశ్నించారు. రోడ్లు వేసేందుకు రూ.19,760కోట్లు టెండర్స్ పిలిచారని చెప్పారు. ఇన్ని వేల కోట్ల టెండర్లు పిలిచి.. ఇప్పుడేమో రూ.3వేల కోట్లు చాలు అని మాట్లాడటంలో అర్థముందా అని నిలదీశారు. రాజధానిపై కమిటీ సారథ్యాన్ని అప్పటి మంత్రి నారాయణకు అప్పగించారని, ఏ రంగంలో నిపుణుడని ఆయనకు బాధ్యతలు అప్పగించారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు రూ.1.9లక్షల కోట్లు అప్పు చేశారని - అంత అప్పు చేసి అమరావతి కోసం కేవలం రూ.10వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడమేంటని ప్రశ్నించారు. అవి కూడా తప్పుడు లెక్కలేనని ఆరోపించారు. గత ప్రభుత్వం కూడా బోస్టన్ గ్రూపు సలహాలు సూచనలు తీసుకుందని గుర్తుచేశారు.