Begin typing your search above and press return to search.

రిజర్వేషన్ల అంశంపై పవన్‌పై వైసీపీ మంత్రి హాట్‌ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   27 Nov 2022 4:30 PM GMT
రిజర్వేషన్ల అంశంపై పవన్‌పై వైసీపీ మంత్రి హాట్‌ కామెంట్స్‌!
X
జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ హాట్‌ కామెంట్స్‌ చేశారు. తూర్పు కాపులను ఓబీసీ జాబితాలో చేర్చకపోవడం వల్ల వారు ఇబ్బందులు పడుతున్నారని పవన్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అలాగే ఉత్తరాంధ్రలో మాత్రమే తూర్పు కాపులను బీసీలుగా చూస్తున్నారని.. మిగిలిన జిల్లాల్లో వారిని బీసీలుగా చూడటం లేదని.. బీసీ ధ్రువీకరణ పత్రాలు కూడా ఇవ్వడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితే తెలంగాణలోనూ ఉందని చెప్పారు. అంతేకాకుండా బొత్స సత్యనారాయణ పెద్ద నాయకుడే అయినప్పటికీ జగన్‌ ప్రభుత్వంలో నోరెత్తి మాట్లాడే సాహసం ఆయన కూడా చేయలేకపోతున్నారని పవన్‌ కల్యాణ్‌ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ.. పవన్‌ కల్యాణ్‌పై హాట్‌ కామెంట్స్‌ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉంది పవన్‌ ఫ్రెండే కదా.. వెళ్లి అడగొచ్చు కదా అని సూచించారు. పవన్‌ ఏదైనా తెలుసుకుని మాట్లాడాలన్నారు. రిజర్వేషన్లను నిర్ణయించేది రాష్ట్రం కాదని.. కేంద్ర ప్రభుత్వమని తెలిపారు. ఇప్పటం గ్రామానికి అభివృద్ధి అవసరం లేదా అని నిలదీశారు. గ్రామాభివృద్ధి కోసం తాము ప్రయత్నిస్తుంటే పవన్‌ రాజకీయాలు చేయడం సరికాదన్నారు.

కాగా తూర్పు కాపు సంఘాలతో మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశమైన పవన్‌ హాట్‌ కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే. 46 లక్షల మంది తూర్పు కాపులు రాష్ట్రంలో ఉన్నారని.. ఈసారి వారంతా తనకు మద్దతివ్వాలని కోరారు. డబ్బులు లేకపోయినా ఫర్వాలేదని.. మంచి నాయకులను తాను తయారుచేస్తానన్నారు. వైసీపీ ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ తూర్పు కాపు సామాజికవర్గానికి చెందినవారే. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అత్యధికంగా తూర్పు కాపులు ఉన్నారు.

మరోవైపు బొత్స సత్యనారాయణపై సోషల్‌ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో అంటకాగుతోందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. పార్లమెంటులో వివిధ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టినప్పుడు ప్రతిదానికీ అడిగినా, అడగకపోయినా వైసీపీ ఎంపీలు మద్దతిచ్చారని చెబుతున్నారు. అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడు సైతం వైసీపీ ఏకపక్షంగా బీజేపీ అడగకుండానే మద్దతు ప్రకటించిందని అంటున్నారు.

అలాగే ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ సైతం తమ బంధం రాజకీయాలకు అతీతమైందని తెలిపారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. పవన్‌.. రిజర్వేషన్ల గురించి మోడీని అడిగితే మరి వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందని నెటిజన్లు నిలదీస్తున్నారు. మరి బొత్స నెటిజన్ల ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారో!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.